19-03-2025 12:29:59 AM
హెచ్‌కేయూ 1 వైరస్ లక్షణాలు..
ప్రమాదకరం కాదన్న వైద్య నిపుణులు..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో కొత్త రకం కరోనా వైరస్ కలకలం రేపుతోంది. కోల్‌కతాకు చెందిన 49 ఏళ్ల మహిళ అరుదైన కరోనా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఆమె హెచ్‌కేయూ 1 వైరస్ లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. బాధిత మహిళ గత 15 రోజులుగా జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె దక్షిణ కోల్‌కతాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.
అయితే రిపోర్టుల్లో ఆమె ఎక్కడికి ప్రయాణం చేయలేదని తేలింది. ఇక హెచ్‌కేయూ 1 వైరస్ కోవిడ్ మహమ్మారికి కారణమైన సార్స్ 2 అంత ప్రమాదకరమైనది కాదని వైద్యులు తెలిపారు. అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉందన్నారు. మానవ కరోనా వైరస్ (హెచ్‌కేయూ1)ను 2004లోనే హాంకాంగ్ విశ్వ విద్యాలయం గుర్తించింది. కరోనా వైరస్ లక్షణాలే దీనిలోనూ కనిపిస్తాయి. ఇదే హెచ్‌కేయూ1ను బెటా కరోనా వైరస్ హాంగ్ కొనెన్స్ అని కూడా పిలుస్తారు. ఈ వైరస్ మానవులను, జంతువులను తీవ్ర ప్రభావితం చేస్తుంది.