calender_icon.png 7 November, 2024 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి అడుగు

12-05-2024 01:42:20 AM

ప్లే ఆఫ్స్ చేరిన కోల్‌కతా 

ముంబైపై ఘనవిజయం

ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన పోరులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటిన కోల్‌కతా.. ముంబైపై ఘనవిజయంతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. 16 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో మొదట మంచి స్కోరు చేసిన కోల్‌కతా.. ఆనక పటిష్ట బౌలింగ్‌తో ముంబైని కట్టడి చేసింది. సాల్ట్, నరైన్ విఫలమైన చోట వెంకటేశ్ అయ్యర్ సత్తాచాటాడు. ఛేదనలో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ పోరాడినా ఫలితం లేకపోయింది. 

కోల్‌కతా: ఈ సీజన్‌లో దుమ్మురేపుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన పోరులో కోల్‌కతా 18 పరుగుల తేడాతో ముంబైని చిత్తుచేసి బెర్త్ ఖరారు చేసుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించగా.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (21 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. నితీశ్ రాణా (33; 4 ఫోర్లు, ఒక సిక్సర్), రస్సెల్ (24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రింకూ సింగ్ (20; 2 సిక్సర్లు), రమన్‌దీప్ సింగ్ (8 బంతుల్లో 17 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్సర్) తలా కొన్ని పరుగులు చేశారు. ఈ సీజన్‌లో విధ్వంసకాండ రచిస్తున్న కోల్‌కత ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (6), సునీల్ నరైన్ (0) ఈ మ్యాచ్‌లో విఫలం కాగా.. కెప్టెన్ శ్రేయస అయ్యర్ (7) ప్రభావం చూపలేకపోయాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, పియూష్ చావ్లా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 16 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులకు పరిమితమైంది.ఇషాన్ కిషన్ (22 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, ఒక సిక్సర్) కాస్త పోరాడారు. రోహిత్ శర్మ (24 బంతుల్లో 19; ఒక ఫోర్, ఒక సిక్సర్) వేగంగా ఆడలేకపోగా.. సూర్యకుమార్ యాదవ్ (11), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (2), డేవిడ్ (0), నేహల్ వధేర (3) విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రస్సెల్, హర్షిత్ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టారు. లీగ్‌లో భాగంగా ఆదివారం డబుల్ హెడర్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.

సంక్షిప్త స్కోర్లు

కోల్‌కతా: 16 ఓవర్లలో 157/7 (వెంకటేశ్ 42, నితీశ్ 33; చావ్లా 2/28, బుమ్రా 2/39),

ముంబై: 16 ఓవర్లలో 139/8 (ఇషాన్ 40, తిలక్ 32; వరుణ్ 2/17, రస్సెల్ 2/34).

పాయింట్ల పట్టిక 2024

జట్టు మ్యా గె ర.రే పా

కోల్‌కతా 12 9 3 1.42 18

రాజస్థాన్ 11 8 3 0.47 16

హైదరాబాద్ 12 7 5 0.40 14

చెన్నై 12 6 6 0.49 12

ఢిల్లీ 12 6 6 12

లక్నో 12 6 6 12

బెంగళూరు 12 5 7 0.21 10

గుజరాత్ 12 5 7 10

ముంబై 13 4 9 8

పంజాబ్ 12 4 8 8

నోట్: మ్యా గె ఓ ర.రే పా