calender_icon.png 7 February, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోలాచల మల్లినాథసూరి

09-12-2024 12:05:50 AM

పదవాక్య పారావార పారీణుడు

“భారతీ కాళిదాసస్య 

దుర్వ్యాఖ్యా విషమూర్ఛితా

ఏషా సంజీవనీ టీకా తామద్యో జ్జీవయిష్యతి॥”

అని ఘంటాపథంగా చెప్పుకున్న మహామహోపాధ్యాయుడు మల్లినాథసూరి. పదవాక్య పారావార పారీణుడుగా పండితుల ప్రశంసలు అందుకున్న ఆయనను యావత్ భారతదేశంలోని విద్వాం సులందరూ “వ్యాఖ్యాతృ సార్వభౌముని”గా, “మహామహోపాధ్యాయుని”గా గౌరవించి సంస్కృత సాహితీ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. 

తాతా మనవలది ఒకే పేరు

మెదక్ మండలం కొలచెలమలోని ఒక ప్రముఖ పండిత వంశంలో జన్మించిన ఈ మల్లినాథుని తాతకూడా మల్లినాథ నామధేయుడే. నాటి కాకతీయ సార్వభౌముని తో సన్మానాలను అందుకున్న ఆ తాత మనవడే ఈ మల్లినాథుడు. సంస్కృతంలోని ప్రసిద్ధ పంచకావ్యాలకు గొప్ప వ్యా ఖ్యానాలను అందించిన ఈ మహాపండితుడు మొత్తం దేశంలోని సంస్కృత వి ద్వాంసుల మన్ననలు పొందాడు. ఆయ నపై శ్లోకంలో చెప్పుకున్నట్టుగా ‘కువ్యాఖ్యలతో మూర్ఛితురాలైన కాళిదాసుని సరస్వ తి తన వ్యాఖ్యలతో తిరిగి జీవించిందని’ ఘనంగా చెప్పుకున్నాడు.

అంటే, మల్లినాథుడు వ్యాఖ్య రచించే నాటికే సంస్కృత మహాకావ్యాలకు వ్యాఖ్యానాలు వెలువడ్డాయని తెలుస్తున్నది. అవన్నీ కవి హృదయా న్ని, ప్రతిభను సమగ్రంగా ఆవిష్కరించలేక పోయాయన్న భావనతో తాను ఈ కావ్య వ్యాఖ్యానాలకు పూనుకొన్నాడని అర్థమవుతున్నది. దీన్నిబట్టి, మల్లినాథుని వ్యాఖ్యాన ప్రతిభ అనన్య సామాన్యమైందన్న విష యం పాఠకులకు అవగతమవుతుంది.

ఆరు సంస్కృత కావ్యాలకు వ్యాఖ్యానం

సంస్కృత కావ్యాల్లో ప్రధానమైనవి రఘువంశము, కుమార సంభవము, మేఘసందేశము, నైషధీయ చరితము, శిశుపాల వధము, కిరాతార్జునీయము ఈ ఆరింటికీ మల్లినాథసూరి విశేషమైన వ్యాఖ్యానాలుగా రాశాడు. ఆయనే వ్యాఖ్యానాల అవతారికల్లో ‘తాను కవినని కూడా’ చెప్పుకున్న శ్లోకం ఒకటి కనిపిస్తుంది. 

“మల్లినాథ కవిస్సోయం, 

మందాత్మానుజి ఘృక్షయా

వ్యాచేష్టే కాళిదాసీయం 

కావ్యత్రయమనాకులమ్‌॥

అన్న శ్లోకాన్నిబట్టి ఆయన కేవలం వ్యాఖ్యాత మాత్రమే గాక కవికూడా అని సాహిత్య చరిత్రకారులు గుర్తించారు. కొంత అన్వేషణతో మల్లినాథు డు ‘రఘువీర చరితమ్’ అనే కావ్యాన్ని కూడా రచించినట్లు వారు పేర్కొన్నా రు. అయితే, ఇది అలభ్యం. సాధారణంగా సంజీవనీ వ్యాఖ్య, ఘంటాపథ వ్యాఖ్య, సర్వంకష వ్యాఖ్య, జీవాతు వ్యాఖ్య, సర్వపథీన వ్యాఖ్య, తరళ వ్యాఖ్య, సిద్ధాంజన వ్యాఖ్య, పరిమళ వ్యాఖ్య, నిష్కంటక వ్యాఖ్య అం టూ వింగడిస్తుంటారు.

మల్లినాథుడు కూ డా ఇందులోని పేర్లనే తానూ తన వ్యాఖ్య కు పెట్టుకున్నాడు. దాదాపుగా అన్ని వ్యాఖ్యానాల్లో నూ అవతారిక రాసే సంప్రదాయాన్ని పాటిం చాడు. అందులో తన సాహిత్య సారజ్ఞతను గురించి కూడాd

“యే శబ్దార్థ పరీక్షణ ప్రణయినో యేవాగుణాలంక్రియా

శిక్షా కౌతుకినో విహర్తు మనసో యేచధ్వనేరధ్వని

క్షుభ్యద్భావ తరంగితే రససుధా సింధౌమిమం క్షంతియే

తేషామేష కృతేకరోతి వికృతిం మాఘస్య సర్వంకషామ్‌”

అంటూ చెప్పుకున్నాడు. పూర్వం ఉన్న వ్యాఖ్యానాలకంటే మల్లినాథుని వ్యాఖ్యానాలకు ఆసేతు శీతాచల పర్యం తం విస్తృత ప్రశస్తి కలిగింది. ఇదే ఆయన ప్రతిభకు ప్రమాణం.

పుష్కలంగా కవిత్వ స్పర్శ

మల్లినాథుడు వ్యాఖ్యానాల్లో దైవస్తుతి కూడా చేసిన విధానాన్ని గమనిస్తే ఆయనకు కావ్య నిర్మాణం చేయగలిగే శక్తి ఉందనిపిస్తుంది. కావ్యావతారికల్లో దైవస్తుతి చేశారు. శివ విష్ణు, గణేశ, సరస్వతి స్తుతుల్లో కవిత్వ స్పర్శ పుష్కలంగా ఉంటుంది.

“మాతామహ మహాశైలం, 

మహాస్తదపితామ్‌

కారణం జగతాంవందే 

కంఠాదపరి వారణమ్‌॥

“బృందార కాయత్ర భవంతి భృంగా మందాకినీ యత్ర మరంద బిందుః

తవార విందాక్షవతారవిందం వందే చతుర్వర్గ చతుష్పథం తత్‌॥

కీ.శే. మల్లాది సూర్యనారాయణ శాస్త్రి తమ సంస్కృత సాహిత్య చరిత్రలో మల్లినాథుని గురించిన విశేష సమాచారాన్ని అందించారు. అందులో మల్లినాథుని వంశంలో తాతకూడా మల్లినాథుడే. ఆయన కుమారుడు ‘శాత్రవ కల్పకారికావృత్తి’ కర్తయైన కవర్ది. ఈయన కుమారు డే మహావ్యాఖ్యాత మల్లినాథసూరి. మల్లినాథసూరి కుమారుడే విద్యానాథుని ‘ప్రతాప రుద్రీయ’మనే అలంకార శాస్త్రానికి ‘రత్నాపణ’ వ్యాఖ్య రచించిన కుమా రస్వామి సోమపీథి.

అయితే, ‘మల్లినాథసూరికి పెద్దిభట్టు అనే ఒక సోదరుడు ఉన్నట్టు కూడా’ శాస్త్రి పేర్కొన్నారు. లోకం లో ఈ కావ్య వ్యాఖ్యానాలన్నీ పెద్దిభట్టే రాసి మల్లినాథుని పేరు పెట్టాడన్న ఒక అపప్రథ ఉన్నట్టు పేర్కొన్నారు. కానీ, అది నిలబడని వాదమని కూడా వారు తెలిపారు. మల్లినాథుని కుమారుడైన కుమార స్వామి పలు సందర్భాల్లో తన తండ్రిని గురించి పేర్కొన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొంటే ఈ అపప్రధ సమసిపోతుంది. ‘రత్నాపణ’ వ్యాఖ్యాకారుడైన కుమారస్వామికి మహాదేవాది నలుగురు కుమారులు ఉన్నారు. మహాదేవుని కుమారుడైన శంభువు విశ్వ జిద్యాగాన్ని చేసినట్టు తెలుస్తున్నది.

కాకతీయుల తదనంతర కవి

వీరి వంశంలో జన్మించిన పండితుల వివరాలను శాస్త్రి  విపులంగా పేర్కొన్నారు. “నారాయణుడనే కవి సంస్కృత చంపూ రామాయణానికి ‘పద యోజనము’ అనే వ్యాఖ్య రాశాడు”. ఆ అవతారికలో

“ఇతి శ్రీపదవాక్య పారావార పారీణ, కోలాచల మల్లినాథసూరి

సూనునా విశ్వజనీన విద్యస్య 

విద్యన్మణేః పెద్దనార్య స్యానుజేన

కుమారస్వామి సోమపీథినా 

విరచితే ప్రతాపరుద్రీయ వ్యాఖ్యానే..”

అని రాసుకున్నాడు. తాను అంతటి పండిత వంశంలో జన్మించిన వానిగానూ చెప్పుకున్నాడు.మల్లినాథసూరి కాలాన్ని గురించి కూ డా కొన్ని చర్చలు జరిగాయి. ఆయన తాత ప్రతాపరుద్రునితో గౌరవాన్ని పొందిన శతావధానిగా పేర్కొన్న ఆధారాలు ఉన్నా యి. అంటే, ఈ మల్లినాథుడు తదనంతర కాలానికి చెందిన వాడేనని పండితులు నిర్ధారించారు.

అంతేగాక, కుమారస్వామి సోమపీథి రచించిన ‘రత్నాపణ’ వ్యాఖ్యాన అవతారికలో “పురాకిల కాకతి కుల సంభూతే గణపతి నామ్నీ మహారాజే.. తన్మహిషీ రుద్రదేవీ.. దౌహిత్రే ప్రతాపరుద్ర రాజ్యధురం నిదధ్ధే..” అని పేర్కొన్న దాన్నిబట్టి, కృతి నాయకుని నిరూపిస్తూ కుమార స్వామి చెప్పిన మాటల్లో ‘పురా’ అన్న శబ్ద ప్రయోగం మేరకు, వీరంతా తరువాతి వారని సాహిత్య చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

పైగా మల్లినాథసూరి కూడా తన వ్యాఖ్యానాల్లో సర్వజ్ఙ సింగభూపాలుని ‘రసార్ణవ సుధాకరాన్ని’ పేర్కొన్న దృష్ట్యా, ఈయన కాకతీయ సామ్రాజ్యానంతర కాలం వాడని భావిస్తున్నారు. ఒకవేళ ఈయన సర్వజ్ఞ సింగభూపాలుని సమకాలీనుడు లేదా తరువాతి కాలానికి చెందిన వాడని స్పష్టంగా తెలుస్తున్నది.

అందరూ మహాపండితులే

మల్లినాథసూరి వంశమంతా పండిత వంశమే. తాత మొదలు మునిమనుమల వరకు కూడా మహాపండితులే. అప్పటి పాలకులతో ఘనంగా సత్కారాలను పొం దిన వారే. అధికంగా ప్రసిద్ధ రచనలకు వ్యాఖ్యానాలు చేసిన వారే వీళ్ల వంశంలో ఎక్కువమంది ఉన్నారు. ఒక కావ్యం రాయ డం కన్నా ప్రసిద్ధమైన ఓ మహాకావ్య నిర్మాణాన్ని పరిశీలించి వ్యాఖ్యానం రాయడం మరింత క్లిష్టమైన పని. వ్యాఖ్యాత మహా పండితుడై ఉండాలి.

కవి ప్రయోగించే శబ్దాల స్వరూపాలు తెలుసుకోగలిగే శబ్దశాస్త్ర పాండిత్యం తనకు ఉండి తీరాలి. కవి ప్రయోగించిన అలంకారాదుల స్వారస్యం తెలియాలి. అలంకార శాస్త్ర గ్రంథాలలో లోతైన అభినివేశం ఉండాలి. అన్నింటికీ మించి కవిత్వ ధర్మం ప్రధానంగా వ్యాఖ్యాత అవగాహనలో ఉండాలి. ఏ ప్రయోగమైనా అర్థం చేసుకుని, కవి అంతరంగాన్ని తెలుసుకొని, అది సార్థకమైందో కాదో నిర్ణయించగలగాలి.

అందులో సాహి త్య ప్రపంచానికే వెలుగులు పంచిన సూర్య సమాన తేజోమూ ర్తులైన కాళిదాసు, శ్రీహర్షుడు, భారవి, మాఘుడు వంటి మహనీయుల విభిన్న రచనా పద్ధతులు, వారి అంతరంగాలు పూర్తిగా అర్థం చేసుకున్న వ్యాఖ్యాత వ్యాఖ్యానమే లోకంలో చిరస్థాయిగా నిలుస్తుంది. ఈ విషయంలో సంస్కృత కావ్య వ్యాఖ్యాతలు అందరిలోకి మల్లినాథునిదే ప్రథమ స్థానం. ఎంతో ప్రామాణికంగా, కవి ప్రయోగాలకు సంబంధించిన విశేషాలను శబ్ద ప్రయోగాల్లోని ఔచిత్యాలను సప్రమాణంగా, సాధికారికంగా నిరూపించే వ్యాఖ్యాన పద్ధతిని మల్లినాథసూరి అవలంబించారు.

ఆయన వ్యాఖ్యానమే ప్రమాణం

సాహిత్య ప్రపంచంలో మల్లినాథసూరి వ్యాఖ్యానానికి ఉన్న ప్రామాణికత అపురూపమైంది. కాళిదాసు కృతుల్లోని ‘కుమార సంభవం’ కావ్యానికి ఆయన వ్యాఖ్యానం 8 సర్గల వరకే ఉంది. తదనంతరం మిగిలిన 4 సర్గలు ఇతరులతో వ్యాఖ్యానం జరిగింది. అయితే, కాళిదాసు ‘కుమార సంభవం’ కావ్యం కేవలం 8 సర్గలు మాత్రమే రాశాడని, మిగిలిన సర్గలు ప్రక్షిప్తాలని, ఇతరులు ఎవరో రాసి కాళిదాసు కావ్యంలో కలిపారని పలువురు సాహితీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

అంటే, వారికి మల్లినాథుని వ్యాఖ్యానమే ప్రమాణమైంది. ‘ఒకవేళ 8 సర్గలకే రాసి వ్యాఖ్యాత వృద్ధుడై మరణించి ఉండవచ్చు’ అన్న వాదన కూడా ఉంది. కానీ, స్వయంగా మల్లినాథుడు చెప్పుకున్న ‘మాఘీ మేఘే వయం గతః’ అనే మాటనుబట్టి, ఆయన వృద్ధాప్యంలో వ్యాఖ్యానించిన గ్రంథాలు ‘శిశుపాల వధం’, ‘మేఘ సందేశం’ అన్నవేనని అర్థమవుతున్నది. మహా సముద్రం వంటి సంస్కృత సాహిత్యపు లోతులను మధించి కావ్యామృత ఆస్వాదాన్ని కలిగించిన మహాకవి, పండితుడు మల్లినాథసూరి తెలుగువారికి ప్రాతఃస్మరణీయుడు.

-గన్నమరాజు గిరిజా మనోహరబాబు

9949013448