calender_icon.png 15 November, 2024 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొట్టాలి కోహ్లీ

15-06-2024 01:20:29 AM

సాధారణంగా ఏ పెద్ద టోర్నీ జరిగినా.. అందులో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అత్యధిక పరుగుల విరుల జాబితాలో ముందు వరసలో నిలవడం పరిపాటి. దశాబ్ద కాలానికిపైగా భారత జట్టు వెన్నెముకగా నిలుస్తున్న విరాట్.. తాజా టీ20 ప్రపంచకప్‌లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా విఫలమైన కోహ్లీ.. ఇకనైనా సత్తాచాటాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే సూపర్ దశకు అర్హత సాధించిన రోహిత్ సేన నేడు ఐర్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఫలితంతో పెద్దగా సంబంధం లేని మ్యాచ్ కావడంతో బ్యాటింగ్ లోపాలను సరిచేసుకొని మనవాళ్లంతా సమష్టిగా కదంతొక్కాలని మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. గత మూడు మ్యాచ్‌ల్లో న్యూయార్క్ పిచ్ భయపెట్టగా.. ఫ్లొరిడాలో జరగనున్న ఈ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉండటం అభిమానులను కలవర పెడుతోంది. 

లౌడర్‌హిల్: ఐసీసీ ట్రోఫీ కోసం పుష్కర కాలంగా ఎదురుచూస్తున్న టీమిండియా.. టీ20 ప్రపంచకప్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శనతో దూసుకెళ్తోంది. గ్రూప్ భాగంగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన రోహిత్ సేన ఇప్పటికే సూపర్ బెర్తు ఖరారు చేసుకోగా.. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో శనివారం కెనడాతో తలపడనుంది. గత మూడు మ్యాచ్‌లను న్యూయార్క్ నసావు కౌంటీ గ్రౌండ్‌లో ఆడిన భారత్.. ఈ సారి ఫ్లోరిడాలో అడుగుపెట్టనుంది. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మెగాటోర్నీలో భారత జట్టు వరుస విజయాలు సాధిస్తున్నా.. బ్యాటింగ్ యూనిట్ మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయలేదనే చెప్పాలి. న్యూయార్క్ పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తుందని ఎంత సమర్థించుకున్నా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్రపంచ శ్రేణి బ్యాటర్లకు పిచ్‌తో పెద్దగా సంబంధం ఉండదనే విషయం మరవకూడదు.

రోహిత్ ఒక మ్యాచ్‌లో అర్ధశతకం సాధించగా.. కోహ్లీ మాత్రం ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఇక చివరగా ఆడిన పోరులో భారత సంతతికి చెందిన అమెరికా పేసర్ సౌరభ్ నేత్రవల్కర్ బౌలింగ్‌లో కోహ్లీ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి విమర్శలు మూటగట్టుకున్నాడు. కాస్త సంయమనం చూపితే విరాట్ తిరిగి గాడిన పడతాడని మాజీలు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఐర్లాండ్‌తో పోరులోనైనా కోహ్లీ తన మాస్టర్ క్లాస్ ఆట బయట పెడతాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. స్ట్రయిక్‌రేట్‌పై విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో ఐపీఎల్ 17వ సీజన్‌లో 150కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టిన విరాట్ ఇక్కడ అదే జోరు కొనసాగించలేకపోవడం మేనేజ్‌మెంట్‌ను సైతం కలవరపెడుతోంది.

వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్‌లో అద్భుత రికార్డు ఉన్న కోహ్లీ గాడిన పడితే సూపర్ ముందు టీమిండియాకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది. పంత్ మంచి టచ్‌లో ఉండగా.. గత మ్యాచ్‌లో సూర్యుకుమార్ యాదవ్, శివమ్ దూబే కూడా రాణించారు. బౌలింగ్‌లో మాత్రం భారత్‌కు తిరిగులేకుండా ఉంది. ఏస్ పేసర్ బుమ్రా నిప్పులు చెరుగుతుంటే.. అతడి అండతో మరో ఎండ్ నుంచి అర్ష్ దీప్ వికెట్ల పంట పండించుకుంటున్నాడు. మరోవైపు అత్యధిక శాతం మంది ప్రవాస భారతీయులు ఉన్న కెనడా జట్టు ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అమెరికా, పాకిస్థాన్ చేతిలో పరాజయం పాలైన కెనడా.. ఐర్లాండ్‌పై గెలుపొందింది.