న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ సీజన్ రంజీ ట్రోఫీలో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్నాడు. ఈ నెల 30న రైల్వేస్‌తో జరగనున్న మ్యాచ్‌కు ఢిల్లీ తరఫున కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. దీంతో పుష్కరకాలం తర్వాత కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడనుండడం విశేషం. మెడ నొప్పితో బాధపడుతున్న కోహ్లీ జనవరి 23న సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నట్లు ఇదివరకే తెలిపాడు. కాగా నొప్పి నుంచి ఉపశమనం పొందిన కోహ్లీ రైల్వేస్ మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నట్లు స్వయంగా తెలిపాడు. కోహ్లీతో పాటు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ఢిల్లీ తరఫున ఆడనున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబై తరఫున రంజీ మ్యాచ్ ఆడనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఈ ఇద్దరు బరిలోకి దిగనున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గావస్కర్ సిరీస్‌ను 1 కోల్పోయిన భారత్ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. సీనియర్లు కోహ్లీ, రోహిత్ ఏ మాత్రం అంచనాలు అందుకోలేకపోయారు. ఇక వచ్చే నెల జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతోన్న రోహిత్, కోహ్లీ ఐపీఎల్ ముగిసిన అనంతరం జూన్‌లో ఇంగ్లండ్‌తో ఆడబోయే టెస్టు సిరీస్‌లో పాల్గొననున్నారు.