30-03-2025 12:38:45 AM
కుర్చీ పోయిందనే దు:ఖించే వారిని పట్టించుకోవద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
కొడంగల్ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో శేషవస్త్రాలు సమర్పణ
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి
వికారాబాద్, మార్చి 29: కొడంగల్ ప్రజలు తనకు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే శక్తిని ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం కొడంగల్‌లో ఆయన పర్యటించారు. కొడంగల్‌లోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ 45వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. స్వామివారికి సీఎం రేవంత్‌రెడ్డి శేషవస్త్రాలు సమర్పించారు. సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు. కొందరికి వాళ్ల కుర్చీ పోయిందనే దు:ఖం ఉండొచ్చని, వాళ్లను పట్టించుకోవద్దని అన్నారు.
వక్ఫ్ బిల్లు అంశాన్ని అక్బరుద్దీన్ ఓవైసీ కంటే ముందుగానే తానే లేవనెత్తానని సీఎం గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు ముస్లింలకు ఎక్కువ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. కొడంగల్‌లో ముస్లింల అభివృద్ధికి ఎమ్మెల్యే నిధులు నుంచి 25 శాతం ముంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్క సంతకంతో కొడంగల్‌కు అన్నీ వస్తాయని, మీరు వెళ్లి ఎవ్వరినో అడగాల్సిన పనిలేదని నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం వెంట కలెక్టర్ ప్రతిజైన్ తదితరులు ఉన్నారు.