calender_icon.png 16 April, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టాలపై అవగాహన అవసరం!

13-04-2025 01:18:06 AM

టెక్నాలజీ ఎంత పెరిగినా మహిళలపై అన్యాయాలు, అత్యాచారాలు మాత్రం తగ్గడం లేదు. విద్యాలయం నుంచి పనిచేసే వరకు అతివలకు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మహిళలకు రక్షణగా వివిధ చట్టాలు రూపొందించినా, అవగాహన లేక వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. చట్టాలపై మహిళలకు అవగాహన అవసరం. మహిళల రక్షణకు రాజ్యాంగం ప్రత్యేక చట్టాలు రూపొందించింది. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వడమే కాకుండా న్యాయవాదిని నియమించింది. సమస్యలు వచ్చినప్పుడు, రక్షణ కరువైనప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. 

మహిళలను వేధించినా బలవన్మారణానికి పురికొల్పినా, హత్య చేసినా, అత్యాచారం చేసినా, అవమానపర్చినా, వారి హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే భారత శిక్షాస్మతి కింద నేరంగా పరిగణిస్తారు. 

మహిళల మర్యాదను అవమానిస్తూ మాటల రూపంలో, సంజ్ఞల రూపంలో, ఏదైనా వస్తు ప్రదర్శన ద్వారా అసభ్యకర ప్రవర్తనతో కించపరిస్తే ఈ నేరానికి ఏడాది సాధారణ జైలు, జరిమానా విధిస్తారు. నేర పూర్వక బలవంతం, సంజ్ఞల ద్వారా మహిళలను వేధిస్తే సెక్షను 355(ఎ) ప్రకారం ఐదు ఏళ్లకు తగ్గకుండా ఏడేళ్ల వరకు పొడిగించి జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. 

అత్తింటి వేధింపులకు..

భార్యను వేధింపులకు గురిచేయడం నేరం. వరకట్నం కింద వేధిస్తే 304(బి) సెక్షన్ కింద ఏడేళ్లు తక్కువ లేకుండా జీవితఖైదు వరకు శిక్ష విధిస్తారు. ఆత్మహత్యకు ప్రేరేపిస్తే సెక్షన్ 306 ప్రకారం పదేళ్ల జైలు, జరిమానా.. అలాగే ప్రసవానికి ముందు గర్భంలోని శిశువును చిదిమేస్తే మూడేళ్ల జైలు, జరిమానా అనుభవించాలి. 

వరకట్న నిషేధం..

వరకట్నం ఇచ్చినా, తీసుకున్న వ్యక్తులకు వరకట్న నిషేధ చట్టం కింద ఐదేళ్ల జైలుశిక్ష. రూ.15 వేల జరిమానా లేదా కట్నకానుకల విలువలో ఏది ఎక్కువైతే దానికి సమానమైన జరిమానా భరించాలి. 

నైతిక నియమాల ఉల్లంఘనకు..

బహిరంగ ప్రదేశంలో అసభ్యకర పాటలు పాడటం, మరేదైనా అసభ్యకర చర్యలు చేయడం సెక్షన్ 294 ప్రకారం నేరం. ఇందుకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. బాల, బాలికలకు అసభ్యకర సాహిత్యం వస్తు సామాగ్రి వంటివి విక్రయించడం తీవ్ర నేరంగా సెక్షన్ 293 ప్రకటించింది. ఈ నేరం కింద మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా తప్పదు. 

అత్యాచారం, నేరాలు..

హింసా ప్రవృత్తితో స్త్రీ ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక అపచారం చేయడం అత్యాచార నేరంగా పరిగణిస్తారు. సెక్షన్ 376 (ఎ) నుంచి ‘డి’ వరకు క్లాజులలో సందర్భం, తీవ్రతను బట్టి శిక్షలు ఖరారు చేస్తారు. సెక్షన్ 376 (1) ప్రకారం ఏడేళ్లకు తగ్గకుండా పదేళ్ల వరకు, ప్రత్యేక సందర్భాల్లో జీవితకాలం వరకు జైలుశిక్ష జరిమానా విధించే అవకాశముంది. మోసపూరితంగా నమ్మించి ఇష్టంలేని వివాహానికి ప్రయత్నిస్తే ఆ వ్యక్తికి సెక్షన్ 366 ప్రకారం పదేళ్ల జైలు, జరిమానా విధిస్తారు. 

పోక్సో చట్టం

పోక్సో చట్టం ప్రకారం.. 18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్ష అమలయ్యేలా ఈ చట్టాన్ని రూపొందించారు. వారిపై అత్యాచారానికి పాల్పడ్డ దోషులకు మరణశిక్ష విధిస్తారు.  

- స్వేచ్ఛ, హైకోర్టు అడ్వకేట్