అశ్వారావుపేట (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం గ్రామపంచాయతీలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి హలో శుభోదయం కార్యక్రమాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నిర్వహించారు. గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి వీధిని సందర్శించి స్థానికులను కలుస్తూ వారి సమస్యలు నేరుగా తెలుసుకుంటూ, వాటికి త్వరలోనే పరిష్కారం చూపుతాననీ హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అందించే పథకాలను వారికి వివరిస్తూ త్వరలోనే మరిన్ని పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవతో నిధులు సమీకరించి ఈ 5 సంవత్సరాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో ప్రజలకు చేరవేసి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.