- భారత్, న్యూజిలాండ్ మూడో టెస్టు
- కివీస్ 235 ఆలౌట్.. టీమిండియా 86/4
- జడేజా ఐదు వికెట్ల ప్రదర్శన
ముంబై: వాంఖడే వేదికగా మొదలైన మూడో టెస్టులో తొలి రోజే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. కివీస్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేశామన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసి కష్టాల్లో పడింది.
గిల్ (31 నాటౌట్), పంత్ (1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఎజాజ్ పటేల్ 2 వికెట్లు పడగొట్టాడు. చేతిలో ఆరు వికెట్లు ఉన్న టీమిండియా మరో 147 పరుగులు వెనుకబడి ఉంది. కోహ్లీ (4) రనౌట్‌గా వెనుదిరగ్గా.. కెప్టెన్ రోహిత్ శర్మ (18) మరోసారి నిరాశపరిచాడు. అనంతరం జైస్వాల్, గిల్ కలిసి రెండో వికెట్‌కు 53 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు.
ఓపెనర్ జైస్వాల్ (30) మంచి టచ్‌లో కనిపించినప్పటికీ భారీ స్కోరు చేయలేకపోయాడు. అయితే నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన మహ్మద్ సిరాజ్‌ను ఎజాజ్ పటేల్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో క్రీజులోకి కోహ్లీ రాక తప్పలేదు. అయితే అనూహ్యంగా హెన్రీ బౌలింగ్‌లో అనవసర పరుగుకు యత్నించిన కోహ్లీ రనౌట్‌గా పెవిలియన్ చేరాడు.
ఈ దశలో పంత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రోజును ముగించాడు. అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న న్యూజిలాండ్ 234 పరుగులకు ఆలౌటైంది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై జడేజా, సుందర్‌లు చెలరేగారు. డారిల్ మిచెల్ (82), విల్ యంగ్ (71) నిలకడగా ఆడడంతో న్యూజిలాండ్ 200 పరుగుల మార్క్‌ను అధిగమించింది. జడేజా ఐదు వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లతో మెరిశాడు.