న్యూ ఢిల్లీ, జూలై 30: బ్రిటన్‌లో కత్తులు, గన్లతో స్కూళ్లు, బహిరంగ ప్రదేశాల్లో దాడులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా సోమవారం వాయువ్య ఇంగ్లాండ్‌లోని నదీ తీరంలోని ఓ భవనంలో చిన్నారులకు .. టేలర్ స్విఫ్ట్ నృత్యం, యోగా క్లాస్ నిర్వహిస్తున్న క్రమంలో ఓ దుండగుడు లోనికి ప్రవేశించి కత్తులతో వారిపై దాడికి పాల్పడ్డాడు. చిన్నారులు, నృత్య సిబ్బంది బిగ్గరగా అరుస్తూ అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. దాడిలో ఇద్దరు పిల్లలు స్పాట్‌లోనే చనిపోగా.. మరో తొమ్మిదిమందికి గాయాలయ్యాయి. కాగా ఈ దాడిలో గాయపడి చికిత్సపొందుతున్న తొమ్మిదేళ్ల బాలిక మంగళవారం మరణించింది. ఈ దాడిలో ఇప్పటికే 6, 7 ఏళ్ల వయస్సు గల ఇద్దరు పిల్లలు చనిపోగా తాజాగా తొమ్మిదేళ్ల బాలిక చనిపోవడంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. నిందితుడు(17)ని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితుడు వేల్స్‌లోని కార్డిఫ్ వాసి అని పోలీసులు తెలిపారు.