calender_icon.png 26 March, 2025 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేకే ఓసిపి మేనేజర్ తన వైఖరి మార్చుకోవాలి

25-03-2025 10:52:48 PM

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి ఏరియాలోని కేకే ఓసిపి మేనేజర్ కార్మికుల ఇబ్బందులకు గురి చేస్తున్న తన వైఖరిని మార్చుకోవాలని గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ సూచించారు. మంగళవారం ఆయన ఓసీపీని సందర్శించి, కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓసిపి కార్మికులు భోజన విరామ సమయంలో భోజనం చేస్తుండగా వారి భోజనం పూర్తికాకముందే వారిని ఓసిపి లోపలికి పంపించడం, అదేవిధంగా వారిపైన సూపర్వైజర్ లతోని ఒత్తిడి చేస్తూ, కార్మికులను సరిగ్గా భోజనం చేయకుండా చేసి, కార్మికులను ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపించారు.

అదేవిధంగా కార్మికులు నిత్యం పూజలు చేస్తున్న మైసమ్మ అమ్మవారికి ప్రతి మూడు నెలలకు ఒకసారి కార్మికులు మేకల తోటి పూజలు నిర్వహిస్తారని, ఆ పూజలను సైతం ఓసిపి పరిధిలో ఎవరూ చేయకూడదని కార్మికుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆంక్షలు విధించడం తగదన్నారు. గనిలో పనిచేసే కార్మికులు, అధికారులు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మైసమ్మకు మొక్కులు చెల్లించే అనావతి సింగరేణిలో అనేక సంవత్సరాలు నుండి ఉందని, సింగరేణి వ్యాప్తంగా ప్రతి గనులు, విభాగాలలో మైసమ్మ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కేకే ఓసిపి మేనేజర్ దానిని వ్యతిరేకిస్తూ ఆదేశాలు ఇవ్వడం సరైనది కాదన్నారు. అదేవిధంగా ఓసీపిలో పనిచేస్తున్న కార్మిక సమస్యలను ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఓసిపి లోపలికి వెళ్లి విధులు నిర్వహిస్తున్న మహిళలకు మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని చెప్పినప్పటికీ ఇప్పటివరకు వాటిని ఏర్పాటు చేయలేదని, ఓసిలో స్పాటర్లను పెట్టకపోవడం, వారికి గొడుగులు ఇవ్వకుండా, ఎండలో నిలబెట్టడం, సర్వే విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు ఎండాకాలం గొడుగులు ఇవ్వకపోవడం, మహిళలకు ఇచ్చినటువంటి గదులలో భోజనం చేయడానికి బెంచీలు ఏర్పాటు చేయకపోవడం లాంటి అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. వీటిని ఓసిపి మేనేజర్ దృష్టికి తీసుకువెళ్తే, కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, అసిస్టెంట్ కార్యదర్శి సోమిశెట్టి రాజేశం, యూనియన్ ఓసిపి ఇంచార్జ్ ఆర్నకొండ ఆంజనేయులు, మైనింగ్ స్టాప్ ఇంచార్జ్ జి సత్యనారాయణ, నాయకులు పి బానయ్య, దినేష్, రాజేష్ కుమార్ యాదవ్, గాండ్ల సంపత్, కోటయ్య, రాజేశంలు పాల్గొన్నారు.