- చైర్మన్ ధన్‌ఖడ్‌ను కలిసి రాజీనామా లేఖ
- బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరాను
- నైతిక విలువలు పాటించే రాజీనామా చేశాను
- ఇప్పుడు సొంత ఇంటికి వచ్చినట్లుంది
- కాంగ్రెస్ నేత కే కేశవరావు
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): రాజ్యసభ సభ్యత్వానికి కే కేశవరావు (కేకే) రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు గురువారం అందజేశారు. కేకే బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేకే.. పార్టీ మారడంతో తన సభ్యత్వాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.
రాజ్యసభ సభ్యుడిగా రెండేళ్ల పదవీకాలం ఉండగా నే రాజీనామా చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత కేకే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ గుర్తుపై రాజ్యసభ ఎంపీగా ఎన్నికైనందునే రాజీనామా చేసినట్లు తెలిపారు. నైతిక విలువలు పాటించి, చట్టానికి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలన ప్రజాస్వామ్యబద్ధంగా ఉందని, గత ప్రభుత్వంలో కుటుంబ ప్రచారం ఎక్కువగా చేసుకునేవారని అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ నా సొంత ఇల్లు.. నేను కాంగ్రెస్ మనిషిని. కాంగ్రెస్ ఎంపీలతోనే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. తిరిగి కాంగ్రెస్‌లో చేరినందుకు సంతోషంగా ఉంది’ అని తెలిపారు. కేకే రాజీనామా ఆమోదం పొందగానే.. ఆ సీటు ఖాళీ అవుతుంది. ఆ తర్వాత వచ్చే ఉప ఎన్నికల్లో మళ్లీ ఆయననే బరిలోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలోని కేకే నివాసానికి వెళ్లి కాసేపు చర్చించారు.
హైదరాబాద్‌కు తిరిగొచ్చిన సీఎం
రెండు రోజులపాటు ఢిల్లీలో బీజీబిజీగా గడిపిన సీఎం రేవంత్ గురువారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. బుధవారం ఢిల్లీకి వెళ్లగానే కేకే కాంగ్రెస్‌లో చేరే కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఖర్గే, రాహు ల్, ఇతర పార్టీ పెద్దలతో సమావేశమై.. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ఇతర పార్టీల నుంచి చేరికలు, మంత్రివర్గ విస్తరణ, నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం తదితర అంశాలపై చర్చించారు. గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరారు. విభజన చట్టంలోని అంశాలను, పెండింగ్‌లో ఉన్న నిధులతో పాటు ఇతర అంశాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.