calender_icon.png 23 October, 2024 | 4:55 PM

వంటింటి వైద్యం ఒంటికి దివ్యౌషధం!

02-09-2024 12:00:00 AM

ఆరోగ్యం ఎక్కడో లేదు. మనం ఆచరించే జీవన విధానంలోనే ఉంది. మన ఇంట్లో దొరికే వంటింటి దినుసుల్లో ఉంది. జలుబు, కడుపు మంట, తలనొప్పి.. ఇలా ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కిచెన్ రెమిడీస్‌తో తిప్పికొట్టొచ్చు. ఏదైనా చిన్నరొగమొస్తే ఇప్పటికీ మన పెద్దవాళ్లు పసుపు, అల్లం, వామతోనే నయం చేస్తారు. అంతేకాదు.. సైంటిస్టులు సైతం మనదేశ మహిళలు వాడే వంటింటి దినుసుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని  చెప్పారు. అవి ఏమిటో తెలుసుకుందాం..

పసుపు 

భారత సంప్రదాయంలో పసుపుది ప్రత్యేకమైన స్థానం. మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల వంటకాల్లో దీన్ని తప్పకుండా వాడుతారు. పసుపు ఒక యాంటీ బయోటిక్‌గా పనిచేస్తూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. శ్వాసకోశ సమస్యలతో పాటు క్యాన్సర్ మహమ్మారితో ఇది పోరాడుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మంపై వాపులు, మంట రాకుండా కూడా పసుపు నిరోధిస్తుంది. పసుపును నల్ల మిరియాలతో కలిపి తీసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయి. పసుపును ఆహారంలో చేర్చడమే కాకుండా కళ్ల చుట్టూ అప్లు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందొచ్చు. పసుపు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, వాటిని సమతుల్యంగా ఉంచేలా చేస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును కూడా పసుపు మెరుగుపరుస్తుంది. 

అల్లం

సాధారణంగా వంటింట్లో అల్లం ఓ ముఖ్యమైన పదార్థం. ఆరోగ్యాన్ని పరిరక్షించే అల్లం తీసుకోవడానికి కొంతమంది ఇష్టపడరు. కానీ ఆరోగ్యపరంగా అల్లం చేసే మేలు అంతా ఇంతా కాదు. వాంతులతో ఇబ్బందులుపడేవాళ్లు చిన్న అల్లం ముక్కను నోట్లో పెట్టుకుని రసం తాగితే ఆ ఇబ్బంది తొలగిపోతుంది. తలనొప్పి నివారణకు పనిచేస్తుంది. ఈ వర్షాకాలంలో క్రమం తప్పకుండా అల్లం టీ తాగితే  జలుబు, దగ్గు, ఆయాసం నుంచి ఉపశమనం పొందొచ్చు. అల్లం టీ తాగితే రుతుస్రావ సమయంలో ఉపశమనం పొందొచ్చు. మిచిగాన్ యూనివర్సిటీ తాజా పరిశోధనల ప్రకారం అల్లంలో గర్భాశయ క్యాన్సర్ నిరోధక గుణాలున్నాయని స్పష్టమైంది. అంతేకాదు ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తాయి.

దాల్చిన చెక్క

వంటింటి దినుసుల్లో దీని పాత్ర కీలకం. కూరల్లో దీనిని బాగా ఉపయోగిస్తారు. గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం సమస్యలను తగ్గిస్తుంది. దాల్చిన చెక్క కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఆస్తమా లేదా శ్వాసకోశ వ్యాధులకు కూడా దాల్చినచెక్క మేలు చేస్తుంది. దాల్చిన చెక్క ఆర్థరైటిస్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. పీరియడ్స్ పెయిన్ సమస్యను దూరం చేయడంలో బాగా పనిచేస్తుంది. 

మిరియాలు

ఇవి రుచిని ఇవ్వడమే కాకుండా బోలెడన్ని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే మిరియాలు అతిగా తీసుకున్నా అనేక ఇబ్బందులు వస్తాయి. ప్రతిరోజు పరిమితంగా మిరియాలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.  టైప్ టు డయాబెటిస్ తో బాధపడేవారికి మంచి ఆరోగ్యాన్నిస్తాయి. మిరియాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు.. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

నువ్వులు

నువ్వులలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియంతోపాటు ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పీచు పుష్కలంగా ఉండే నువ్వులను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు  నువ్వులు చాలా మంచివి. నువ్వులలో ఉండే అధిక కాల్షియం దీనికి తోడ్పడుతుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులతో పోరాడేందుకు నువ్వులను తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. నువ్వులు మన జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో బాగా పనిచేస్తాయి. 

జిలకర 

మనం వాడే పోపుగింజలలో ఉండే జిలకర కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో జిలకర నీరు తాగితే ఎన్నో వ్యాధుల నుంచి బయటపడొచ్చు. శ్వాస సంబంధిత సమస్య ఏదైనా ఉంటే పరిగడుపున జిలకర నీటిని తీసుకుంటే చాలా మేలు చేస్తుంది. దీంట్లో చాలా పొటాషియం ఉండటంతో రక్తపోటు కంట్రోల్‌లో ఉండేలా చేస్తుంది. గర్భధారణ సమయంలో జిలకర తీసుకుంటే జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. మధుమేహా వ్యాధిగ్రస్తులు రోజు ఖాళీ కడుపుతో జిలకర నీరు తాగితే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఇది శరీరంలో ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని కారణంగా రక్తంలో చక్కరస్థాయి నియంత్రణలో ఉంటుంది. అయితే జిలకరతో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నప్పటికీ దానిని కూడా పరిమితంగానే తీసుకోవాలి. ఎక్కువ వాడితే కొన్ని ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది.

ఉల్లి

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. రుచిపరంగానే కాదు ఆరోగ్యకరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. వంటల్లో మాత్రమే కాదు అందంగా ఉంచడంలోనూ ఉల్లిపాయ బాగా పనిచేస్తుందని  చాలా మందికి తెలియదు. ఉల్లిపాయల్లో విటమిన్ సి, బి6, పొటాషియం ఉంటాయి. దీనిలో అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్‌గా పనిచేస్తాయి. ఉల్లిపాయ పేస్ట్ కొన్ని చర్మ సంబంధిత వ్యాధులకే కాదు జుట్టు సంబంధిత సమస్యలకు అద్భుతమైన హోం రెమెడీ. ఉల్లిపాయ రసం చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సాయపడుతుంది. ఉల్లిపాయ రసం మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉల్లిపాయ ఫేస్ట్‌ను చర్మంపై అప్లు చేయడం ద్వారా చర్మంపై ఉండే విషపూరిత కణాలను తొలగించడంలో సహాయపడతాయి.  

వాము

వంటింట్లో దొరికే వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చికెన్ లాంటి హెవీ ఫుడ్ తినప్పుడు డయేరియా, మలబద్ధకం, కడుపునొప్పి మొదలైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాము తీసుకోవడం ద్వారా వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. అర గ్లాసు వాము నీటిని తాగితే రుతుక్రమంలో వచ్చే ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాము తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ సమస్యను కూడా అధిగమించవచ్చు. వాంతులు, వికారం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. బరువు తగ్గడానికి వాము ఉపయోగపడుతుంది. 

వెల్లుల్లి

ఎన్నో ఔషధ గుణాలున్న వెల్లుల్లిని మనం శతాబ్దాలుగా వాడుతున్నాం. రోజువారి జీవితంలో వెల్లుల్లి వాడితే రోగనిరోధక శకి పెరగడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండే వెల్లుల్లిలో అల్లిసిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు రోగనిరోధక వ్యవస్థకు మెరుగుపరుస్తాయి.

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు రక్తపోటును నివారిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం బాగుంటుంది. అలాగే వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గిస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ రుగ్మతలకు చెక్ పెడుతుంది. కొన్ని హెల్త్ సర్వేల్లో వెల్లుల్లికి యాంటీకాన్సర్ లక్షణాలు ఉన్నాయని తేలింది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి అవసరమైన మాంగనీస్, విటమిన్ బి6, విటమిన్ సి వంటి పోషకాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉంటాయి. 

పుదీనా

వంటింటింలో ఉండే పుదీనాలో కూడా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గడానికి పుదీనా వాటర్ బాగా పనిచేస్తుంది. ఈ ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బీ పాటు క్యాల్షియం, ఐరన్ లాంటివి ఉంటాయి. ఇవన్నీ జీవక్రియను మెరుగుపరుస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు పుదీనా వాటర్ తీసుకుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. చర్మ సమస్యలను తగ్గించడంతో పాటు కాలిన గాయాలను కూడా తగ్గిస్తుంది. 

హోమ్ రెమిడీస్ చాలా బెస్ట్

మన ఇంట్లో దొరికే పసుపు, అల్లం, లవంగం వాటితో చిన్న చిన్న అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి చాలామంది దగ్గుతో బాధపడుతుంటారు. అలాంటివాళ్లు తులసి, పుదీనా ఆకులు వేటినీటితో కలిపితీసుకుంటే వెంటనే ప్రయోజనం ఉంటుంది. ఇక లవంగం కూడా బాగా పనిచేస్తుంది. అయితే అద్భుత ప్రయోజనాలు ఉంటాయని అదేపనిగా వాడుతుంటారు. అల్లం ఎక్కువగా వాడితే కడుపులో మంట వస్తుంది. కాబట్టి వీలైనంతవరకు మితంగా తీసుకోవాలి. ఎప్పుడూ మందులపై ఆధారపడకుండా హోమ్ రెమిడీస్‌ను ట్రై చేసుకోవచ్చు.

డాక్టర్ వళ్లకొండ దీపక్ కుమార్, జనరల్ ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్