26-01-2025 12:06:10 AM
హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గులాబీ కళ్లజోడు తీసి చూస్తే.. అన్ని సజావుగానే కనిపిస్తాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. కిషన్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారా? లేక కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
శనివారం చామల గాంధీభవన్‌లో మీడియా తో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పెట్టుబడుల సమీకరణకు సంబంధించిన అంశాలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. గత ప్రభుత్వం పదేండ్లలో చేయలేని అభివృద్ధిని సీఎం రేవంత్‌రెడ్డి మొదటి ఏడాదిలోనే చేసి చూపి స్తుంటే.. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ నేతలు ఓర్చుకోవడం లేదని మండిపడ్డారు.
అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని వారికి ఈనో ప్యాకెట్స్ ఇస్తామంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కాలుకు మల్లు కుచ్చుకుంటే.. నోటితో తీస్తానన్న విధంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీరు ఉందని చామల దుయ్యబట్టారు. కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
దావోస్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే అభినందించాల్సిందిపోయి విమర్శలు చేయడం తగదన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు స్క్రిప్టులు పంచుకు ని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తున్నాయని, బీఆర్‌ఎస్ ఆఫీస్ నుంచి బీజేపీకి వచ్చిన స్క్రిప్ట్‌నే కిషన్‌రెడ్డి చదువుతున్నారని ఆరోపించారు.
బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రియల్టర్‌పై దాడిని బీఆర్‌ఎస్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దావోస్‌కు బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి కూడా సీఎంలు, మంత్రులు వెళ్లారని, వారికి వచ్చిన పెట్టుబడులు ఎన్నో చెప్పాలని కిషన్‌రెడ్డికి సవాలు విసిరారు.