డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక ఆయనకు తెలియదా?
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్లగొండ, నవంబర్ 17 (విజయక్రాంతి): కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేపట్టింది మూసీ నిద్రో.. తీర్థయాత్రో అర్థంకావడం లేదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి మూసీ తీరాన నిద్ర చేయకుండా ఎక్కడికో వెళ్లి మూసీ నిద్ర అంటే ఎలా అని ప్రశ్నించారు. మూసీ నిద్ర చేసే వారు ఆ నీటితో ముఖం కడుక్కుని, స్నానం చేసి చిత్తశుద్ధి నిరుపించుకోవాలన్నారు.
మూసీ ప్రక్షాళన అంశాన్ని బీజేపీ, బీఆర్‌ఎస్ రాజకీయం కోసం వాడుకుంటున్నాయని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళన చేయడం లేదా? అడ్డున్న ఏ ఒక్క ఇళ్లు కూల్చడం లేదా కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. మూసీ నీటిలో సూపర్ బగ్ బ్యాక్టీరియా ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించిన విషయం తెలియదా? అని నిలదీశారు.
మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పూర్తి నివేదిక (డీపీఆర్) ఇవ్వకుండానే ప్రభుత్వంపై విపక్షాలు అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. మూసీ ప్రక్షాళన జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందన్న అక్కసుతో బీఆర్‌ఎస్, బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
మూసీ ప్రక్షాళనపై ఈటల రాజేందర్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆక్షేపించారు. ఒకప్పుడు మూసీ నీటిని నల్లగొండ ప్రజలు తాగునీటికి వాడేవారని, మళ్లీ ఆ పరిస్థితి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.