హైదరాబాద్: నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని ధర్నా చౌక్ లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో శనివారం ధర్నా దిగింది. ధర్నాలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ విషయమే మరిపోయారని విమర్శించారు. ఇచ్చిన హామీలు అన్ని విస్మరించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేకతను కూడగట్టుకుంటోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కి ప్రజలందరూ స్వస్తి చెబుతారని జోస్యం చెప్పారు. నిరుద్యోగులకు మేలు చేస్తామని ప్రమాణం చేసి విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎవరికి దొరికినంత వారు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విస్తారంగా అవినీతి కొనసాగుతోందన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో మాత్రమే రాష్ట్రంలో మార్పు వచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. హామీలన్నీ వంద రోజుల్లో ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని కేంద్రమంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేవలం పార్టీ జెండా మాత్రమే మారిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజావాణి వినిపించేందుకు బీజేపీ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.