హైదరాబాద్,(విజయక్రాంతి): బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర స్థాయి కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సమావేశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పార్టీ కార్యలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సునీల్ బున్సల్, లక్ష్మణ్, ఎంపీలు ఈటల రాజేందర్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, ఎమ్మెల్యేలు మహేశర్ రెడ్డి, వెంకట రమణారెడ్డి హాజరయ్యారు. సంస్థాగత ఎన్నికలపై జిల్లా అధ్యక్షులు, రిటర్నింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలని, బీజేపీ ఊపిరి సంస్థాగత ఎన్నికల వ్యవస్థ అని పేర్కొన్నారు. మహిళ, యువత, రైతుల సమస్యలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడానికి సిద్ధం కావాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం చేస్తోందని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దివాలా తీశాయని కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు.