అబద్ధాలకు అత్తాగారిల్లు, తల్లిగారిల్లు కేసీఆరే..
టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి పౌరుషం ఉంటే తెలంగాణకు ఐటీఐఆర్‌ను మంజూరు చేయించాలని, ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించాలని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకే అమెరికాకు వెళ్లారని స్పష్టంచేశారు.
మంగళవారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి అంశాన్ని బీజేపీ నేతలు రాజకీయం చేసి కోతల రాయుళ్లుగా మిగిలిపోతున్నారని ఎద్దేవాచేశారు. ముచ్చర్లలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీకి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారని, అలాంటి మంచి విషయాలను బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడరని నిలదీశారు.
మూసీ ప్రక్షాళన కమీషన్ల కోసమే అంటున్న బీజేపీ నేతలు.. గంగా నదీ ప్రక్షాళన కూడా ప్రధానమంత్రి మోదీ అవినీతి కోసమే చేస్తున్నారా? అని ప్రశ్నించారు. మూసీ నదీ ప్రక్షాళన విషయంలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు స్పష్టత ఉందా? లేదా? అని నిలదీశారు. మూసీ ప్రక్షాళన చేయవద్దని బీజేపీ పార్టీ తరఫున తీర్మానం చేసి చెప్పండని ఫైర్ అయ్యారు.
అబద్ధాలకు కేరాఫ్ కేసీఆర్
అబద్ధాలకు తల్లిగారిల్లు, అత్తగారిళ్లు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అని జగ్గారెడ్డి విమర్శించారు. గత పదేళ్లలో రుణమాఫీ ఫైల్‌కు బూజు పట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ ఫైల్ బూజు దులిపామని చెప్పారు. 8 నెలల కాలంలోనే కాంగ్రెస్ రైతు రుణమాఫీ చేయడం గర్వకారణమని అన్నారు.అసెంబ్లీ సమావేశాలను రేవంత్‌రెడ్డి హుందాగా నడుపుతున్నారని, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం ఒక రోజే సభకు రావడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తుంటే హరీశ్‌రావు, కేటీఆర్‌లు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.