హైదరాబాద్: శౌచాలయాల నిర్వహణ పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం బేగంపేట హరితప్లాజాలో శుక్రవారం జరిగింది. కలెక్టర్ అధ్యక్షతన భేటీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. కేంద్రం, రాష్ట్రాలు కేటాయించిన నిధులు, వినియోగం, పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ భేటీకి వివిధ శాఖల అధికారులు, దిశా కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ పరిధిలోని శౌచాలయాల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శౌచాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దారుణం అన్నారు. స్వచ్ఛభారత్ లో కేంద్రంతో పాటు రాష్ట్రం వాటా ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ లోని 2,251 శౌచాలయాల నిర్వహణపై దృష్టిపెట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.