పెండింగ్ బిల్లులు, ధరల సవరణకు ప్రభుత్వం హామీ : యూబీఎల్
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): బీరు ప్రియులకు యూనైటెడ్ బ్రూవరీస్ సంస్థ చల్లని కబురు చెప్పింది. కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరా పునరుద్ధరించనున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు, ధరలను సవరించడం లేదంటూ.. ఈ నెల 8 నుంచి కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరాను ఆ సంస్థ నిలిపివేసింది.
ఈ క్రమంలో ప్రభుత్వం కూడా కఠినంగానే వ్యవహరించింది. యూబీఎల్ కోరిన విధంగా బీర్ల ధరలు పెంచితే ప్రజలపై భారం పడుతుందని సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. దీంతో కింగ్‌ఫిషర్ బీర్లు ఇక మార్కెట్‌లోకి రావనే ప్రచారం జరిగింది.
ఆ తర్వాత ప్రభుత్వం, యూబీఎల్ కంపెనీ మధ్య చర్చలు జరిగాయి. పాత బకాయిల చెల్లింపు, బీర్ల ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరాను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నట్టు యూబీఎల్ వెల్లడించింది.
బీర్ల సరఫరాలో 69 శాతం వాటా యూబీఎల్ కింగ్‌ఫిషర్‌తోపాటు ఏడు బ్రాండ్ల బీరు సరఫరా ఆగిపోయిన విషయం తెలిసిందే. బీర్ల సరఫరాకు లైన్‌క్లియర్ కావడంతో కింగ్‌ఫిషర్ బీర్ అభిమానులకు ఊరట లభించిందని చెబుతున్నారు. గత రెండేండ్ల నుంచి రూ.702 కోట్ల వరకు బకాయిలు రావాలని సంస్థ పేర్కొంది.