calender_icon.png 23 November, 2024 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిం కర్తవ్యం!

23-11-2024 12:34:00 AM

  1. పలు అవినీతి ఆరోపణల్లో ఐఏఎస్‌లు విచారణకు హాజరవుతున్న వైనం
  2. తాజాగా పలువురు ఐఏఎస్‌ల రహస్య సమావేశం
  3. నిబంధనల ప్రకారమే విధులు నిర్వహించాలని నిర్ణయం!
  4. నేతల మౌఖిక ఆదేశాలను పట్టించుకోవద్దనే భావన

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో పనిచేస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు అవినీతి, అక్రమాల ఆరోపణల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. రాజకీయ నేతలు, ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో విచక్షణారహితంగా నిర్ణయా లు తీసుకోవడం వల్ల అంతిమంగా చిక్కుల్లో పడాల్సివస్తుందనే ఆలోచనతో ఐఏఎస్‌లు మదనపడుతున్నారు. 

ఈడీ, సీఐడీ, జ్యుడీషియల్ కమిషన్ లాంటి పలు విచారణ సంస్థల ముందు విచారణకు హాజరవ్వడంపై ఐఏఎస్ అధికారుల్లో మేధోమథనం మొదలైనట్టుగా సమాచారం. అందులో భాగంగానే.. తాజాగా రెండు, మూడు రోజుల క్రితం  సుమారు 20 మందికిపైగా ఐఏఎస్ అధికారులు రహస్యంగా శంషాబాద్‌లోని ఒక స్టార్ హోటల్‌లో సమావేశమై తాజా సంఘటనలపై చర్చించినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. 

గత ప్రభుత్వంలోని పెద్దలు, ప్రజాప్రతినిధులతో రాసుకుపూసుకు తిరిగిన కొందరు ఐఏఎస్ అధికారులు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లాంటి విచారణ సంస్థల ముందు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలు, అవినీతి, అలాగే ఫార్ములా ఈతూ విషయంలో ఆర్థిక అవకతవకలు పాల్పడటం, జీఎస్టీ స్కాం, అలాగే భూవ్యవహారాల విషయంలో అమోయ్‌కుమార్ లాంటి ఐఏఎస్ అధికారులు ఈడీ విచారణకు హాజరవుతున్నారు.

పైగా రిటైర్డు అయినప్పటికీ.. సీఎస్‌గా పనిచేసిన సోమేశ్‌కుమార్‌కు కూడా అప్పటి వ్యవహారాలు చుట్టుకుని జ్యుడీషియల్ కమిషన్ విచారణకు హాజరైన విషయమూ తెలిసిందే. ఈ నేపథ్యంలో.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన వ్యవహారాలపై శంషాబాద్ సమావేశంలో వారు చర్చించినట్టు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితులకు కారణం..

గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమైన నేతలు ఇచ్చిన మౌఖిక ఆదేశాలను తాము అమలు చేయడమేనని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇకపై ఇలాంటి మౌఖిక ఆదేశాలను పాటించకుండా.. రాతపూర్వకంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను అమలుచేయాలని, వాటిపై నిర్ణయాలు తీసుకోవాలని.. తద్వారా ఇలాంటి అవినీతి, అక్రమాల ఆరోపణల్లో చిక్కుకోకుండా ఉండవచ్చని చర్చించినట్టు తెలుస్తుంది. 

అఖిల భారత సర్వీసులకు సంబంధించి కేంద్ర మార్గదర్శకాలు, డీవోపీటీ స్పష్టమైన నిబంధనలు, నియమాలను నిర్దేశించింది. వీటన్నింటినీ పక్కనపెట్టి.. ప్రభుత్వంలోని కీలక నేతలు, ముఖ్యమైన ప్రజాప్రతినిధుల మౌఖిక ఆదేశాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్ళడం వల్ల ప్రస్తుతం ఈడీ, జ్యుడీషియల్ కమిషన్ లాంటి విచారణలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

పైగా రిటైర్డు అయిన తరువాతకూడా ఇవి వెంటాడుతున్నాయని.. ఐఏఎస్ అధికారులు చర్చించినట్టు తెలుస్తుంది. రాజకీయ నాయకుల దృష్టిలో పడేందుకు నిబంధనలు, రూల్స్‌ను పక్కనపెట్టి పనులు చేయడం వల్ల కేరీర్‌కే మచ్చగా నిలిచే ప్రమాదం ఉందని కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇకపై నిబంధనలు, అఖిల భారత సర్వీసుల మార్గదర్శకాల ప్రకారం పని చేయాలనే చర్చ ఐఏఎస్ అధికారుల రహస్య సమావేశంలో బలంగా విన్పించినట్టు తెలుస్తున్నది.