మృతదేహంతో రోడ్డుపై బంధువుల రాస్తారోకో
గద్వాల (వనపర్తి ), సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): హంతకులు పథకం ప్రకారం వ్యక్తిని హత్య చేశాడని, తప్పించుకోవడానికి విద్యుదాఘాతం ప్రమాదం అని డ్రామా ఆడుతున్నాడని మృతుడు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మృతదేహానికి తిరిగి రీ పోస్టుమార్టం నిర్వహించాలని శనివారం గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దెలబండకు చెందిన బోయ జక్కడిబావి నర్సింహులు (35) తనకున్న మూడెకరాలతో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు.
రోజూలాగానే శుక్రవారం ఉదయమూ పొలం పనులకు వెళ్లాడు. సాయంత్రమైనా నర్సింహులు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. పొలం వద్దకు వెళ్లి చూడగా ట్రాన్స్‌ఫార్మర్ పక్కనే నర్సింహుడులు విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం సాయంతో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
శనివారం ఉదయం మృతుడి బంధువులు నర్సింహులు మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రోడ్డు బైఠాయించారు. హత్య చేసి విద్యుదాఘాతంగా చిత్రీకరించారని ఆరోపించారు. దీంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, పోలీసులు ఈ కేసులో ఓ అనుమానితుడిని అరెస్ట్ చేశారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.