calender_icon.png 10 October, 2024 | 2:51 AM

మంత్రాలు చేస్తున్నారంటూ చంపేశారు !

04-09-2024 12:39:30 AM

  1. గ్రామస్తుల దాడి 
  2. ఒకరి మృతి, ఇద్దరు మహిళలకు గాయాలు 
  3. టేక్మాల్ మండలం గొల్లగూడెంలో దుర్ఘటన 
  4. వేగవంతంగా కేసు విచారణ

మెదక్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): మంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఓ కుటుంబంపై గ్రామస్తులు దాడికి పాల్పడగా ఒకరు మృతిచెందగా, ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. కొల్చారం మండలానికి చెందిన రాములు(65) మెదక్‌లో నివాసం ఉంటున్నాడు. టేక్మాల్ మండలం ఆరెగూడెంలో ఉంటున్న తన సోదరి ఇంటికి రాములు ఇటీవల వెళ్లగా అతడు ఇంట్లో మంత్రాలు చేస్తున్నాడని ఆరోపిస్తూ మంగళవారం గ్రామానికి చెందిన కొందరు అకారణంగా తమపై దాడి చేయడంతో రాములు మృతి చెందాడని.. దాడిలో గాయపడిన రాములు సోదరి గంగమ్మ, బాలమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయమై విచారణ జరిపిన పోలీసుల వివరణ మరోలా ఉంది.

దాడి విషయం తెలుసుకున్న మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీని ‘విజయక్రాంతి’ వివరణ కోరగా రాములు గత మూడు రోజులుగా తీవ్ర విరేచనాలతో బాధపడుతున్నాడని, గొల్లగూ డెంలోని తన సోదరి ఇంటికి రావడంతో ఆమె నిమ్మకాయలతో దిష్టి తీసి వాటిని పక్కింటిలో వేయడంతో గొడవ జరిగిందన్నారు. అయితే రాములును ఎవరూ కొట్టలేదని.. కేవలం కొందరు గంగమ్మ, బాలమణిపై చేయి చేసుకున్నారని చెప్పారు. అప్పటికే తీవ్ర అస్వస్థతతో ఉన్న రాములును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మహిళలపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.