- సరూర్‌నగర్‌లోని అలకనంద ఆస్పత్రిపై వైద్యాధికారుల రైడ్
- అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడిలకు పాల్పడుతున్న యాజమాన్యం
- ఆస్పత్రి సీజ్, పోలీసుల అదుపులో నిర్వాహకుడు
ఎల్బీనగర్, జనవరి 21: ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడ్లకు పాల్పడుత్ను ఆస్పత్రిని సీజ్ చేయడంతో పాటు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాలు.. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో అలకనంద పేరుతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు.
మొదట 9 పడకలతో దరఖానను ప్రారంభించి అనంతరం మల్టీస్పెషాలిటీ పేరుతో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ఇక్కడ రోగులకు చికిత్స చేస్తున్నారు. ఇటీవల ఇదే దవాఖానలో ఆపరేషన్ కోసం వచ్చిన ఒక మహిళ వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయింది. అయితే దీనిపై ఫిర్యాదు రాకపోవడంతో వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అయితే నైపుణ్యం లేని వైద్యులు, సిబ్బందితో ఇక్కడ చికిత్స చేయడంతో పాటు కిడ్నీ రాకెట్ నిర్వహిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులతో మంగళవారం రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వోపాటు ఇతర వైద్యాధికారులు అలకనంద దవాఖానపై దాడులు చేపట్టారు. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
ఇతర రాష్ట్రాలకు చెందిన వైద్యులతోపాటు, సిబ్బందిని నియమించుకుని నిబంధనలకు విరుద్ధంగా రోగులకు శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు తేలింది. ఇతర రాష్ట్రాలకు చెందిన రోగులను ఇక్కడి తీసుకుని వచ్చి కిడ్నీ మార్పిడులకు పాల్పడుతున్నట్లు నిర్దారించారు. తనిఖీల సమయంలో కిడ్నీ దానం చేస్తున్న ఇద్దరితోపాటు.. ఇద్దరు కిడ్నీ గ్రహీతలను గుర్తించినట్లు తెలిపారు.
అయితే తనిఖీలకు వైద్యాధికారులు వస్తున్నట్లు ముందే తెలుసుకున్న వైద్యులు, సిబ్బంది దవాఖాన నుంచి వెళ్లిపోయారు. తనిఖీల సమయంలో దవాఖాన మేనేజ్‌మెంట్‌కు చెందిన సుమంత్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దవాఖానాలో ఇతర చికిత్సలు పొందుతున్నవారిని అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. తదనంతరం ఆస్పత్రిని సీజ్ చేశారు.
దాడుల్లో డిప్యూటీ డీఎంహెచ్‌వో గీత, సరూర్‌నగర్ సీహెచ్‌సీ వైద్యురాలు అర్చన, జీహెచ్‌ఎంసీ అధికారులు, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
పూర్తి నివేదిక ఇవ్వాలి: మంత్రి దామోదర రాజనర్సింహ
సరూర్‌నగర్‌లోని అలకనంద ఆస్పత్రిలో చట్టవిరుద్ధంగా జరుగుతున్న కిడ్నీ మార్పిడ్ల వ్యవహారంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి వివరాలు తెప్పించుకున్నట్లు సమాచారం.కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న డాక్టర్లు, హాస్పిటల్ యాజమాన్యం, ఇతర వ్యక్తులను ఉపేక్షించొద్దని, చట్ట ప్రకారం కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. అనుమతులు లేని ఆస్పత్రులపై చర్యలు తప్పవన్నారు.