- 6 గంటల్లోనే చిన్నారిని రక్షించిన పోలీసులు
తల్లి నుంచి దూరం చేసేందుకు కిడ్నాప్ చేసిన తాత
కామారెడ్డి, జూన్29 (విజయక్రాంతి): కుటుంబ కలహాలతో భార్యభర్తలు దూరం గా ఉంటున్న నేపథ్యంలో తల్లి వద్ద ఉంటున్న 18 నెలల చిన్నారిని ఆమె నుంచి దూరం చేయాలనే దురుద్దేశంతో సొంత తాత కిడ్నాప్ చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డికి చెందిన కలియ స్వప్న, రాములు దంపతులకు 18 నెలల చిన్నారి అంజలి ఉంది. వారు గతంలో జీవదాన్ ఆస్పత్రి ఎదుట నివాసముండేవారు. భార్య, భర్తలకు రెండు నెలల క్రితం గొడవ జరగడంతో తన బిడ్డతో కలిసి స్వప్న కామారెడ్డిలో భర్తకు దూరంగా ఉంటున్నది. చిన్నారి అంజలిని చూసేందుకు కామారెడ్డికి తాత గోలి రాంచందర్ తరుచూ వస్తుండేవాడు.
అయితే తన కొడుకును కోడలు దూరం పెట్టిందని కక్ష పెంచుకున్న రాంచందర్ తల్లి నుంచి చిన్నారిని ఎలాగైనా దూరం చేయాలనుకున్నాడు. దీంతో చిన్నారని శుక్రవారం మధ్యాహ్నం సమయంలో కిడ్నాప్ చేసి సిక్రిందాబాద్‌లోని బొల్లారంకు తీసుకెళ్లాడు. స్వప్న సాయంత్రం 6 గంటలకు డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో కిడ్నాప్ చేసింది చిన్నారి తాతేనని గుర్తించారు. బొల్లారం వెళ్లి చిన్నారితో పాటు నిందితుడిని తీసుకొచ్చి, శనివారం కోర్టులో హాజరుపరిచారు. అనంతరం చిన్నారిని తల్లి స్వప్నకు అప్పగించారు. కాగా 6 గంటల్లోనే కిడ్నాప్ కేసును చేదించిన సీఐ చంద్రశేఖర్‌రెడ్డిని ఎస్పీ సింధూశర్మ అభినందించారు.