calender_icon.png 25 November, 2024 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిలోఫర్‌లో కిడ్నాప్.. గద్వాలలో ప్రత్యక్షం

25-11-2024 03:20:05 AM

  1. కిడ్నాపైన చిన్నారిని రక్షించిన పోలీసులు
  2. 6 గంటల్లో నిందితుల అరెస్టు.. తల్లిదండ్రుల చెంతకు చిన్నారి
  3. మగ సంతానం లేదని కిడ్నాప్‌కు యత్నించిన జంట

హైదరాబాద్ సిటీబ్యూరో/గద్వాల, నవంబర్ 24 (విజయక్రాంతి): నిలోఫర్ ఆస్పత్రిలో కిడ్నాప్‌కు గురైన మగశిశువు ఆచూకీ లభ్యమైంది. కేసు నమోదైన కేవలం 6గంటల్లోనే నాంపల్లి పోలీసులు చిన్నారిని క్షేమంగా తల్లి ఒడికి చేర్చారు.  సైఫాబాద్ ఏసీపీ సంజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లా అలియాస్ వెంకటేశ్, రేష్మా అలియాస్ రేణుక దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

ప్రస్తుతం రేష్మా 8నెలల గర్భవతి. అయితే మళ్లీ అమ్మాయి పుడితే ఎలా అని భయపడుతున్నారు. దీంతో రేష్మా తన సోదరి షాహీనా బేగంను కలిసి పరిస్థితిని వివరించింది. ఈ క్రమంలో వారంతా కలిసి హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రి నుంచి ఓ మగబిడ్డను ఎత్తుకెళ్లాలని పథకం రచించారు. ప్లాన్ ప్రకా రం షాహీనా, అబ్దుల్లా కలిసి శనివారం నిలోఫర్ ఆసుపత్రిలో ఓ చంటిబిడ్డను ఎత్తుకెళ్లారు.

విషయం లేటుగా గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు.. సీసీ కెమెరాలను పరీక్షించగా.. కిడ్నాప్ చేసిన షాహీనా ఆసుపత్రి నుంచి సుమారు 3 కి.మీ ఆటోలో ప్రయాణించిన తర్వాత ఆమెకోసం బైక్‌పై ఎదురుచూస్తున్న అబ్దుల్లాతో బైక్‌పై వెళ్లింది. అనంతరం బైక్ దిగి ఓ వ్యాన్‌లో శివువును తీసుకొని వెళ్లింది.

సీసీ ఫుటేజ్ సాయంతో శిశువుని కర్నూలు వైపు తరలిస్తున్నట్లు గుర్తించిన నాంపల్లి పోలీసులు.. జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులకు సమాచారం అందించడంతో టోల్‌గేట్ సమీపంలో నిందితలను అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీసులకు అప్పగించారు. 

నాంపల్లి పోలీసులు పసికందును తల్లి హసీనా బేగం వద్దకు చేర్చారు. కిడ్నాప్‌కు యత్నించిన షహీనాబేగం(28), అబ్దుల్లా అలియాస్ వెంకటేశ్(35), రేష్మా అలియాస్ రేణుక(30)ను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు.

గద్వాల పోలీసుల కీలక పాత్ర

కిడ్నాప్‌కు గురైన చిన్నారిని కర్నూల్‌వైపు తీసుకెళ్తున్నారనే సమచారం అందింన వెంటనే అప్రమత్తమైన ఉండవెల్లి, అలంపూర్, మానవపాడు మండలాలకు చెందిన పోలీసులు ఉండవల్లి మండల పరిధిలో పుల్లూర్ చెక్‌పోస్టు సమీపంలో వాహనాల తనిఖీలను మమ్మురం చేశారు.

ఆదివారం తెల్లవారుజామున3.30 గంటలకు వ్యాన్‌లో ముగ్గురు చిన్నారులను.. గుర్తించారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని.. మగ శిశువును నాంపల్లి పోలీసులకు అప్పగించారు. కేసును ఛేదించిన పోలీసులను డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ అభినందించారు.