డబ్బుల కోసం వ్యాపారస్తులకు బెదిరింపులు
వివరాలు వెల్లడించిన డీసీపీ సునీతా రెడ్డి
ఇబ్రహీంపట్నం, నవంబర్ 29: ఆదిభట్ల పీఎస్ పరిధిలో ఐదు రోజుల కింద చోటుచేసుకున్న కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు నకిలీ పోలీస్ యూనిఫాం ధరించి, గన్‌తో అమాయక వ్యాపారులను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు శుక్రవారం డీసీపీ సునీతారెడ్డి మీడియాకు తెలిపారు. ఐదు రోజుల కింద కిడ్నాప్‌కు గురైన రచ్చ నారాయణ(71) అనే వ్యాపారవేత్త కేసులో హయత్‌నగర్‌లోని వైదేహినగర్‌కు చెందిన కొరివి ధన్‌రాజ్ (42) కీలకంగా వ్యహరించినట్లు పోలీసులు తెలిపారు.
ధన్‌రాజ్ సులువుగా డబ్బు సంపాదించేందుకు వ్యాపారులను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని పథకం వేశాడు. తన మేనల్లుడు వలవోజు శివకుమార్ (26), స్నేహితులు డేరంగుల శ్రీకాంత్ (26), సుర్వి శేఖర్ (33)లకు చెప్పి ఒప్పించాడు. వ్యాపారి నారాయణకు తమ వద్ద తక్కువ ధరకు ప్లాట్లు ఉన్నాయని, కొనుగోలు చేయాలని మక్కల భవానీ (27) అనే మహిళతో చెప్పించాడు. నమ్మిన నారాయణ తన డ్రైవర్‌తో కలిసి ఈ నెల 21న మెట్రో సిటీ వద్దకు వెళ్లాడు.
అప్పటికే ప్లాన్‌తో సిద్ధంగా ధన్‌రాజ్ గ్యాంగ్ నారాయణ, అతడి డ్రైవర్‌ని కారులో ఎక్కించుకొని గుర్తు తెలియని చోటికి తీసుకెళ్లారు. తుపాకీ ఎక్కుపెట్టి రూ.3 కోట్లు డిమాండ్ చేశాడు. తన వద్ద అంత డబ్బు లేదని, 20 లక్షలు ఇస్తానని చెప్పడంతో రెండు తెల్ల కాగితాల మీద నారాయణ సంతకాలు తీసుకొన్నారు. నారాయణను అక్కడే వదిలి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు భవానీని అదుపులో తీసుకొని విచారించి.. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగతా వారిని అరెస్ట్ చేశారు.