12-03-2025 12:20:50 AM
పాపను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
జనగామ, మార్చి 11(విజయక్రాంతి): పది నెలల పాపను కిడ్నాప్ చేసిన దంపతులతో పాటు వారికి సహకరించిన మరో మహిళను పోలీసులు అరెస్టు చేశారు. పాపను స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు వివరాలను మంగళవారం జనగామ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌పీ చేతన్ నితిన్ వెల్లడించారు.
ఖమ్మం జిల్లా కొత్తగూడెం గ్రామానికి చెందిన పంతంగి సురేశ్ తిరుపతమ్మ దంపతులు కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. వీరికి విజయవాడలో ఓ మహిళ పరిచయమై పసి పిల్లలను అమ్మితే డబ్బులు సంపాదించవచ్చని సలహా ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి దంపతులిద్దరు పసిపిల్లలను కిడ్పాప్ చేసే పనిలో పడ్డారు.
వీరికి కొన్ని నెలల క్రితం వరంగల్ లేబర్ అడ్డాలో జనగామకు చెందిన మేస్త్రీ అజయ్ పరిచయమయ్యారు. ఆయనను ఏదైనా పని ఉంటే చూడాలని కోరగా.. జనగామలోని కళ్లెం రోడ్డులో పీఎల్‌జీ కన్వెన్షన్‌లో పని పెట్టించాడు. అక్కడే చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాంజుల్ రజాక్ కూడా భార్యతో కలిసి కొన్ని రోజులుగా పనిచేస్తున్నాడు.
ఆయనకు 10 నెలల పాప ఉంది. సురేశ్ తిరుపతమ్మ దంపతుల కన్ను ఆ పాపపై పడింది. ఇందుకోసం వారు పాప తల్లిదండ్రులతో కలిసిమెలిసి ఉంటున్నట్లు నటించారు. ఫిబ్రవరి 25న పాపను తీసుకుని బయటికి వెళ్లారు. రాత్రి 11 గంటలైనా తిరిగి రాకపోవడంతో పాప తల్లిదండ్రులు జనగామ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వెతుకుతుండగా మంగళవారం జనగామలోని పెంబర్తి క్రాస్ వద్ద దొరికారు. సురేశ్, తిరుపతమ్మతో పాటు వీరికి సహకరించిన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ముక్కు విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద ఒక బైక్, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్త్స్ర చెన్నకేశవులు, కానిస్టేబుళ్లు కరుణాకర్, మహేందర్, అరవింద్, ఏఏవో సల్మాన్‌ను వరంగల్ సీపీ, జనగామ డీసీపీ, ఏఎస్‌పీ అభినందించారు.