03-03-2025 11:51:21 PM
ప్రియుడితో కలిసి తల్లి ఘాతుకం..
బీహార్‌లోని ఛప్రా జిల్లాలో ఘటన..
పట్నా: కొత్త ఇంటిని కట్టుకోవడానికి తన ప్రియుడి చేత సొంత కొడుకునే కిడ్నాప్ చేయించి కుటుంబ సభ్యులను డబ్బులు డిమాండ్ చేసిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఛప్రా జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలుడు ఆదిత్య కుమార్ కిడ్నాప్‌కు గురయ్యాడంటూ బంధువులు పోలీసులను ఆశ్రయించారు. రూ. 25 లక్షలు ఇవ్వకపోతే బాలుడిని చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడి తల్లి బబితా దేవి ప్రవర్తన అనుమానంగా ఉండడంతో ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు.
ఈ నేపథ్యంలో కిడ్నాప్ చేయించింది తననేంటూ ఒప్పుకోవడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రియుడు నితీశ్ కుమార్‌తో కలిసి సొంత ఇంటిని కట్టుకోవాలనుకున్నట్లు తెలిపింది. అందుకు డబ్బు అవసరం కావడంతో తన కుమారుడిని లవర్ చేత కిడ్నాప్ చేయించినట్లు బబిత పేర్కొంది. అనంతరం ప్రియుడి చేత తన కుటుంబసభ్యులకు ఫోన్ చేయించి 25 లక్షలు డిమాండ్ చేసినట్లు ఒప్పుకుంది. బబిత సమాచారం మేరకు పోలీసులు నితీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పట్నాలో ఒక చోట దాచి ఉంచిన ఆదిత్యను పోలీసులు క్షేమంగా ఇంటిసభ్యులకు అప్పగించారు.