28-08-2024 12:28:28 AM
12 గంటల్లో చిన్నారిని రక్షించిన పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (విజయక్రాంతి): కిడ్నాప్‌నకు గురైన చిన్నారిని పోలీసులు రక్షించి 12 గంటల్లోనే తల్లి ఒడికి చేర్చారు. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో మమత అనే మహిళ భిక్షాటన చేస్తూ ఏడాది వయసున్న తన కూతురితో ఫుట్‌పాత్‌పైనే నివాసముంటున్నది. కామారెడ్డికి చెందిన దాసరి మంజుల(29) భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నది. అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో భిక్షాటన చేసేది.
రెండు నెలల క్రితం మంజుల కాచిగూడ రైల్వే స్టేషన్‌కు రాగా మమతతో పరిచయం ఏర్పడింది. ఒకరోజు వీరిద్దరికి గొడవ జరగగా మంజులను గాయపరచి ఆమె వద్ద నుంచి రూ.1,500లను మమత తీసుకుంది. మమతపై పగ పెంచుకున్న మంజుల.. మమత కూతరును కిడ్నాప్ చేసి హానీ తలపెట్టాలనుకుంది. తన సోదరి భర్త మున్నాతో కలిసి సోమవారం కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వచ్చి, అర్ధరాత్రి 2 గంటల సమయంలో చిన్నారిని కిడ్నాప్ చేసి ఆటోలో ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడి నుంచి డబీర్‌పురా రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. చిన్నారి కనిపించకపోవడంతో చిన్నారి అమ్మమ్మ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సుమారు సీసీ కెమెరాలను పరిశీలించి, చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. మొత్తం 6 బృందాలుగా ఏర్పడి.. డబీర్‌పురాకు చేరుకుని చిన్నారిని రక్షించారు. చిన్నారిని తల్లికి అప్పగించి నిందితులను రిమాండ్‌కు తరలించారు. చిన్నారిని రక్షించిన పోలీసులను ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ప్రత్యేకంగా అభినందించారు.