calender_icon.png 16 January, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఠాణాలోనే తన్నుకున్నారు!

13-09-2024 03:10:00 AM

బాన్సువాడలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ

ఏనుగు అనుచరుడిపై దాడిచేసిన పోచారం వర్గీయులు

కామారెడ్డి, సెప్టెంబర్12 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, బాన్సువాడ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరుడిపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన పోచారం, ఆయన అనుచరులు.. బాన్సువాడ సీనియర్ కాంగ్రెస్ నాయకుల మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఏనుగు అనుచరులపై పోచారం అనుచరులు కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కకు ఏనుగు రవీందర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి ఫిర్యాదు చేశారు. పోచారం అనుచరులు సృష్టిస్తున్న వివాదాలను, పోలీసు కేసులను వివరించారు. అది మనుసులో పెట్టుకొని పోచారం అనుచరులు నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, వర్ని మండలం వడ్డెపల్లికి చెందిన భీమా శంకర్, అతడి కొడుకుపై బుధవారం రాత్రి దాడి చేశారు.

ఈ విషయాన్ని వర్ని పోలీసులకు తెలుపడంతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భీమా శంకర్‌పై పోలీస్‌స్టేషన్‌లోనే.. పోలీసుల సాక్షిగా పోచారం అనుచరులు మరోసారి దాడిచేశారు. కాంగ్రెస్ పార్టీలోకి ఇటీవల  వలసవచ్చిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు దాడులు చేయడంతో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దాడిలో పాల్గొన్న వర్ని మండలానికి చెందిన బీఆర్ ఎస్ పార్టీ మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గోపాల్ కుమారులు వెగలపుడి జయంత్, వెగలపూడి యశ్వంత్(బన్నా), శ్రీనగర్ మాజీ ఉపసర్పంచ్ ముప్పవరపు అన్వేశ్, నెహ్రూనగర్ మాజీ సర్పంచ్ నాని బాబు, శ్రీనగర్ మాజీ వార్డ్ మెంబర్ మేక రాజేశ్, గంట వేణు చైతన్య అలియాస్ (బాబి), శ్రీనగర్ మాజీ సర్పంచ్ రాజు, వీనగర్ గ్రామానికి చెందిన కోనేరు శ్రీకాంత్ తదితరులు అందరూ చూస్తుండగానే పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడిపై దాడి చేశారు.

ఈ దాడులను ఖండిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని కాంగ్రెస్ అధినాయకులకు, పోలీస్ అధికారులకు ఏనుగు రవీందర్‌రెడ్డి ఫోన్‌లో ఫిర్యాదుచేశారు. గురువారం సాయంత్రం పోచారం అనుచరుల చేతిలో గాయపడిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భీమా శంకర్‌ను రవీందర్‌రెడ్డి పరామర్శించారు. దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ విషయాన్ని పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకెళ్తానని రవీందర్‌రెడ్డి స్పష్టంచేశారు. పెద్ద మనిషి హోదాలో ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి చిల్లర రాజకీయాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. తన అనుచరులపై దాడిని సీరియస్‌గా తీసుకుంటున్నట్టు చెప్పారు. తమ అనుచరులపై పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, అనవసరంగా కేసులు నమోదు చేస్తున్న విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని స్పష్టంచేశారు.