calender_icon.png 2 November, 2024 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో మద్యం ధరల కిక్కు!

02-11-2024 01:42:34 AM

  1. ఆదాయం పెంచుకునేందుకు కసరత్తు 
  2. ప్రతి నెలా వెయ్యి కోట్లు టార్గెట్!
  3. బీరుకు రూ. 20, లిక్కర్‌కు రూ. 20 నుంచి రూ. 70 వరకు పెంచే యోచనలో అబ్కారీ శాఖ 

ధరల పెంపుతో రూ. 40 వేల కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశం 

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి) : అబ్కారీ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదు. రాబడి పెంచుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.  అందుకు త్వరలోనే  మద్యం ధరలను సవరించేందుకు అబ్కారీ శాఖ  కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం ధరలతో సమానంగా.. తెలంగాణలో కూడా పెంచాలనే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. పెంచిన ధరలతో సర్కారుకు ప్రతి నెలా రూ. 1000 కోట్ల ఆదాయం సమకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది.

అందులో భాగంగానే ఒక  బీరుపై రూ. 20, లిక్కర్‌పై క్వార్టర్‌కు రూ. 20 నుంచి రూ. 70 వరకు పెంచే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికా రులు చెబుతున్నారు. అయితే తెలంగాణలో మద్యం ధరలు అధికంగా ఉన్నట్లుగా విమర్శలు రావడంతో..

గత ప్రభుత్వం 2023 మే నెలలో బీరుపై రూ. 10, లిక్కర్‌పై రూ. 20 చొప్పున తగ్గించింది. అబ్కారీ ఆదాయం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండటంతో.. గతంలో తగ్గించిన ధరలతోపాటు మరి కొంత అదనంగా చేర్చి ధరలు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇదే సమయంలో ఈ ఆర్థిక సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ ద్వారా వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల ద్వారా రూ. 36 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేసింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో అబ్కారీ శాఖకు  ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ. 9,493 కోట్లు, వ్యాట్ ద్వారా మరో రూ. 8,040 కోట్ల ఆదాయం వచ్చింది.

అంటే ఇప్పటివరకు ఆ రెండింటి ద్వారా దాదాపు రూ. 17,533 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. మిగిలిన ఆరు నెలల్లో ఇదే మొత్తం వస్తుందని అంచనా వేస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 35 వేల కోట్లకు మించి ఆదాయం వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్‌లు, క్లబ్‌లు, పబ్‌ల ద్వారా రోజుకు సగటున రూ. 100 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్ముడుపోతోంది. అంటే నెలకు సగటున రూ. 3,000 కోట్ల నుంచి రూ. 3,500 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ధరలు సవరించినట్లయితే ప్రతి నెలా దాదాపు రూ. 1000 కోట్ల వరకు అదనంగా ఖజానాకు రాబడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

అంటే  రాబోయే 5 నెలల్లో ఇప్పటి అంచనా కంటే మరో రూ. 5 వేల కోట్లు అదనంగా చేరే అవకాశం ఉందని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. అధికారుల అంచనా మేరకు ఆదాయం వచ్చినట్లయితే ఎక్సైజ్ శాఖ నుంచి రూ. 40 వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని అభిప్రాయపడుతున్నారు.  

గుడుంబాపై కఠిన చర్యలు.. 

రాష్ట్రంలో గుడుంబాతో పాటు అక్రమ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు పెరగడంతో ఆదాయం తగ్గిందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది మొదటి ఆరు నెలల్లో 9,108 గుడుంబా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది అదే సమయంలో 18,826 కేసులు నమోదయ్యాయి. అంటే కేసులు రెట్టింపు కావడంతో పాటు దాదాపు 10 వేల మందిని గుడుంబా కేసుల్లో ఆరెస్టు చేశారు.

అక్రమ మద్యం సరఫరా, గుడుంబా తయారీని అరికట్టేందుకు అబ్కారీ శాఖ అధికారులు కఠినంగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలనే ఎక్సైజ్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ  అధికారులతో  సమీక్ష నిర్వహించి..

రాష్ట్రానికి రాబడులను పెంచుకునేందుకు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినట్లుగా సమాచారం. అందులో భాగంగానే గుడుంబా, అక్రమ మద్యం నిరోధానికి కఠిన చర్యలు చేపట్టారు. అందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుగా అబ్కారీశాఖ అధికారులు చెబుతున్నారు. 

ఏపీతో సమానంగా ధరలు పెంచాలని నిర్ణయం.. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీరు ధర రూ. 170 నుంచి రూ. 200 వరకు ఉండగా, తెలంగాణలో రూ. 150 నుంచి రూ. 180 వరకు ఉన్నట్లుగా అబ్కారీశాఖ అధికారులు చెబుతున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒక్కో బీరుపై కనీసం రూ. 20 పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం.

అదే విధంగా లిక్కర్‌పై మూడు, నాలుగు బ్రాండ్లపై క్వార్టర్‌కు రూ. 50 నుంచి రూ. 70 వరకు పెంచనునట్లు తెలుస్తోంది. ఒక్కో పుల్ బాటిల్‌పై రూ. 80 నుంచి రూ. 300 వరకు పెంచాలనే యోచనలో ఉన్నట్లుగా సంబంధిత అధికార వర్గాల సమాచారం. ఇలా పెంచినట్లయితే ఇప్పుడు ధరల కంటే 15 శాతం నుంచి 20 శాతానికి పైగా ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.