- నెపం కోర్టు ఉద్యోగిపై నెట్టివేసిన వైనం
- మనస్తాపంతో సదరు ఉద్యోగి ఆత్మహత్య
- న్యాయం చేయాలంటూ బంధువుల ధర్నా
జయశంకర్ భూపాలపల్లి, జూలై 11(విజయక్రాంతి): ఇద్దరు కి‘లేడి’లు తమ స్వార్దం కోసం చేసిన ఓ ఘరానా మోసానికి ఓ కోర్టు ఉద్యోగి జీవితం బలయ్యింది. కొంతమంది నిరుద్యోగులకు కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.లక్షలు వసూలు చేసి.. నెపం మొత్తం కోర్టు ఉద్యోగిపై వేయడంతో అవమాన భారంతో సదరు కోర్టు ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుం బ సభ్యులు తెలిపిన వివరాలు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మిదేవిపేటకు చెందిన జాటోత్ రాంధన్ నాయక్ (45) జిల్లా కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.
కొన్నినెలల క్రితం భూపాలపల్లికి చెందిన ఇద్దరు మహిళలు కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని రాంధన్ నాయక్ పేరు చెప్పుకుని కొంతమంది నిరుద్యోగుల వద్ద రూ.లక్షలు వసూలు చేశారు. బాధితులకు ఉద్యోగాలు రాకపోవడంతో మహిళలను నిలదీయడంతో వారు తాము రాంధన్ నాయక్‌కు డబ్బులు ఇచ్చామంటూ లక్ష్మీదేవిపేటకు వెళ్లి గొడవ చేశారు. తాను ఎలాంటి మోసం చేయలేదని.. తనకు డబ్బు ల విషయం తెలియదని రాంధన్ నాయక్ ఎంత చెప్పినా వారు పట్టించుకోకుండా దూషించసాగారు. ఆ అవమానాన్ని జీర్ణించుకోలేకపోయిన రాంధన్ నాయక్.. ఈనెల 6న పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు హన్మకొండలోని ఓ ప్రైవే టు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలిం చారు. అక్కడ చికిత్స పొందుతున్న రాంధన్ నాయక్ గురువారం మృతిచెందాడు.
మృతదేహంతో రహదారిపై ధర్నా...
రాంధన్ నాయక్ మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అతడి బంధువులు ధర్నాకు దిగారు. ఈ మేరకు మృతదేహాన్ని గురువారం లక్ష్మిదేవిపేట నుంచి భూపాలపల్లికి తీసుకువస్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు మంజూర్‌నగర్ ప్రధాన రహదారిపై మృతదేహం ఉంచి తమకు న్యాయం చేయాలని నిరసనకు దిగారు. సుమారు గంటపాటు రోడ్డుపై బైఠాయించారు. జిల్లా ఎస్పీ వచ్చి స్పష్టమైన హమీ ఇచ్చే వరకు కదిలేది లేదని పోలీసులకు తెగేసి చెప్పారు. దీంతో సంఘటనా స్థలం నుంచి మృతుడి కుటుంబ సభ్యులతో.. సీఐ .. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడించారు. రాంధన్ నాయక్ ఆత్మహత్యకు కారణమైన వారిని వదిలిపెట్టమని కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హమీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.