హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): 2026లో ఖేలో ఇండియా క్రీడలు హైదరాబాద్ వేదికగా జరగ నున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది.
హైదరాబాద్‌లో 2002లో 32వ జాతీయ క్రీడలు, ఆఫ్రో గేమ్స్, 7వ మిలిటరీ గేమ్స్ సహా అనేక జాతీయస్థాయి పోటీలు జరిగాయని, ఇక్కడ అన్నిరకాల వసతులు ఉన్నాయని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ సింగ్ మాండవీయకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. లేఖను గురువారం రాష్ర్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి కేంద్ర మంత్రికి అందజేయగా.. ఆయన సూత్రప్రాయంగా అంగీకరించారు.
క్రీడలకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్య త ఇస్తున్నదని, బడ్జెట్‌లో కేటాయింపులు పది రెట్లు పెంచినట్లు గుర్తుచేశారు. యువతను ప్రోత్సహించేలా ప్రత్యేక పాలసీని రూపొందిస్తున్నదని వివరించారు. భేటీలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, అనిల్‌కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రామసహాయం రఘురామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.