- మనూ బాకర్, గుకేశ్, హర్మన్‌ప్రీత్, ప్రవీణ్‌కు క్రీడా అత్యున్నత పురస్కారం
మొత్తం 32 మందికి అర్జున.. ముగ్గురికి ద్రోణాచార్య
అర్జున అవార్డు జాబితాలో 17 మంది పారా అథ్లెట్లు
17న రాష్ట్రపతి భవన్‌లో అవార్డుల ప్రదానం
న్యూఢిల్లీ: క్రీడా విభాగంలో దేశ అత్యున్నత పురస్కారంగా భావించే మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును ఈసారి నలుగురు ఆటగాళ్లు అందుకోనున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన షూటర్ మనూ బాకర్ సహా పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్ దొమ్మరాజు, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌లను క్రీడా అత్యున్నత పురస్కారం వరించింది.
అర్జున అవార్డుకు 32 మంది ఎంపికవ్వగా.. అందులో రికార్డు స్థాయిలో 17 మంది పారా అథ్లెట్లు ఉండడం విశేషం. ఈ నెల 17న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఖేల్త్న్ర అవార్డుకు ఎంపికైన ఆటగాళ్లకు రూ. 25 లక్షలు, అర్జున అవార్డుకు ఎంపికైన ఆటగాళ్లకు రూ.15 లక్షల నగదు పురస్కారం అందజేయనున్నారు.
మనూ సహా నలుగురికి
ఖేల్ రత్న అవార్డుకు సంబంధించి తొలుత ప్రకటించిన జాబి తాలో మనూ బాకర్ పేరు లేకపోవడంపై విమర్శలు వచ్చాయి. స్వతంత్ర భారతదేశంలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన మనూ బాకర్‌కు ఖేల్ రత్న అవార్డు ఇవ్వకపోవడం ఏంటని మండిపడ్డారు. అయితే తాజాగా ఆమె పేరును జాబితాలో చేర్చడంతో అభిమానులు శాంతించారు.
గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో వ్యక్తిగత, మిక్స్‌డ్ విభాగాల్లో మనూ కాంస్య పతకాలు నెగ్గిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు వరుసగా రెండో పతకం సాధించడంలో కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్ కీలకపాత్ర పోషించాడు.
కాంస్య పతక పోరులో స్పెయిన్‌ను ఓడించిన భారత్ 41 ఏళ్ల తర్వాత వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించింది. ఇక పారిస్ పారాలింపిక్స్‌లో టీ64 హై జంప్ విభాగంలో అథ్లెట్ ప్రవీణ్‌కుమార్ స్వర్ణంతో మెరిశాడు. ఇటీవలే చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించిన గుకేశ్ కొత్త ప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించాడు. 18 ఏళ్లకే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా గుకేశ్ రికార్డులకెక్కాడు.
దీప్తి, జ్యోతిలకు అర్జున
తెలంగాణ ముద్దుబిడ్డ, పారా అథ్లెట్ దీప్తి జివాంజీని అర్జున అవార్డు వరించింది. గతేడాది పారిస్ పారాలింపిక్స్‌లో మహిళల 400 మీటర్ల టీ20 కేటగిరీలో దీప్తి మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారత పారా అథ్లెట్‌గా దీప్తి జివాంజీ రికార్డులకెక్కింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన జ్యోతి యర్రాజీ కూడా అర్జున అవార్డు అందుకోనుంది.
100 మీటర్ల హార్డిల్స్‌లో భారత ఫాస్టెస్ట్ అథ్లెట్‌గా జ్యోతికి పేరుంది. ద్రోణాచార్య అవార్డుకు సుభాష్ రాణా, దీపాలి దేశ్‌పాండే, సందీప్ సంగ్వాన్ ఎంపికవ్వగా.. అర్జున అవార్డు లైఫ్ టైం కేటగిరీలో మురళీకాంత్ పెట్కర్, సుచా సింగ్, ద్రోణాచార్య లైఫ్ టైం కేటగిరీ అవార్డుకు మురళీధరన్, అర్మాండో కొలాకో ఎంపికయ్యారు.
అర్జున అవార్డుల జాబితా
దీప్తి జివాంజీ (పారా అథ్లెటిక్స్), జ్యోతి యర్రాజీ (అథ్లెటిక్స్), అన్నూ రాణి (అథ్లెటిక్స్), నీతూ (బాక్సింగ్), స్వీటీ బురా (బాక్సింగ్), వంతిక అగర్వాల్ (చెస్) , సలీమా టిటే (హాకీ)
అభిషేక్ (హాకీ), సంజయ్ (హాకీ), జర్మన్‌ప్రీత్ (హాకీ), సుఖ్‌జీత్ (హాకీ), స్వప్నిల్ (షూటింగ్), సరబ్ జోత్ (షూటింగ్), అభయ్ సింగ్ (స్వాష్), అమన్ షెరావత్ (రెజ్లింగ్)
సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్), రాకేశ్ (పారా ఆర్చర్), ప్రీతి పాల్ (పారా అథ్లెటిక్స్), అజీత్ సింగ్ (పారా అథ్లెటిక్స్), సచిన్ కిలారి (పారా అథ్లెటిక్స్), ధరంబీర్ (పారా అథ్లెటిక్స్)
ప్రణవ్ (పారా అథ్లెటిక్స్), హొకటొ సెమా (పారా అథ్లెటిక్స్), సిమ్రన్ (పారా అథ్లెటిక్స్), నవదీప్ (పారా అథ్లెటిక్స్), నితేశ్ కుమార్ (పారా బ్యాడ్మింటన్)
తులసిమతి (పారా అథ్లెటిక్స్), నిత్ర శ్రీ (పారా బ్యాడ్మింటన్), మనీశా రామ్‌దాస్ (పారా బ్యాడ్మింటన్), కపిల్ పర్మర్ (పారా జూడో), మోనా అగర్వాల్ ( పారా షూటింగ్)
రుబీనా (పారా షూటింగ్)