calender_icon.png 20 September, 2024 | 11:07 AM

ఖేడ్కర్ వివాదం

18-07-2024 12:00:00 AM

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో గత వారం మహారాష్ట్రలోని పుణెలో శిక్షణలో ఉన్న పూజాను వాషిమ్‌కు బదిలీ చేయడంతో వెలుగులోకి వచ్చిన ఈ వివాదం ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతూ చివరికి ఆమె ఐఏఎస్ పదవికే ఎసరు తెచ్చేలా మారింది. 2022లో జరిగిన యుపీఎస్‌సీ పరీక్షల్లో ఖేడ్కర్ 821 ర్యాంక్‌తో ఓబీసీ, దివ్యాంగుల కోటాలో ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యారు. డాక్టర్ కూడా అయిన ఆమె పుణె లో ట్రైనీ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచే అధికార దర్పం ప్రదర్శించడం మొదలుపెట్టారు. తనకు ప్రత్యేక కార్యాలయం, రెసిడెన్షియల్ క్వార్టర్స్,  కారుతోపాటు సిబ్బందిని ఇవ్వాలని కిందిస్థాయి అధికారు లకు ఆదేశాలు ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి.

తన లగ్జరీ కారుకు మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, విఐపి నంబరు ప్లేట్‌తోపాటు ఎర్ర బుగ్గను తగిలిం చుకుని తిరిగారని కూడా తేలింది. దీంతో ఆమెను అక్కడి నుంచి వాషిమ్‌కు బదిలీ చేశారు. నిబంధనల ప్రకారం ప్రొబేషనరీ అధికారులకు ఇలాంటి ప్రత్యేక సదుపాయాలు ఏవీ ఉండవు. కానీ, ఖేడ్కర్ ఇవన్నీ డిమాండ్ చేయడంతో ఆమెను తాత్కాలికంగా సూపర్ న్యూమరీ సబ్ కలెక్టర్‌గా బదిలీ చేయడంతోపాటు ఈ ఆరోపణలపై విచారణ మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆమె వికలాంగ, ఓబీసీ సర్టిఫికెట్లపైనా అనుమానాలు మొదలయ్యాయి. తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి ఆమె ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యారన్న ఆరోపణలు వచ్చాయి. వైద్య పరీక్షలకోసం ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు యూపీఎస్‌సీ సిఫార్సు చేయగా, కోవిడ్ సాకు చూపి ఆమె ఆ టెస్టులకు హాజరు కాలేదు.

దీంతో ఆమె సమర్పించిన సర్టిఫికెట్లు బోగస్‌వి అనే అనుమానాలు వచ్చాయి. అంతేకాదు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎంబీబీఎస్‌లో చేరినట్ల్లు కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. దీనికితోడు ఆమె తల్లిదండ్రులు కనిపించకుండా పోవడంతో వారి తీరుపైనా అధికారులు ఆరా తీయడం మొదలుపెట్టారు. పూజా తల్లి గతంలో  పిస్టల్‌తో ఓ రైతును బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభుత్వ అధికారిగా పనిచేసిన ఆమె తండ్రిపైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో పోలీసులు వారిపైనా కేసు నమో దు చేశారు. ఇవన్నీ చాలవన్నట్లుగా సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఆమె రెండు వేర్వేరు పేర్లు ఉపయోగించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలపై ఖేడ్కర్ స్పందిస్తూ, నేరం రుజువయ్యేదాకా ప్రతి ఒక్కరూ నిర్దోషులేనని వ్యాఖ్యానించారు. తాను తప్పు చేశానో లేదో నిర్ణయించాల్సింది మీడియా కాదని, ప్రభుత్వ నిపుణులు మాత్రమేనని అన్నారు. ఈ వివాదాలన్నీ కొనసాగుతుండగానే ప్రభుత్వం ఖేడ్కర్ ట్రైనింగ్‌ను రద్దు చేసి ఆమెను ముస్సో రిలోని ట్రైనింగ్ సెంటర్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. 

సాధారణంగా ఆలిండియా సర్వీసు అధికారులంటే సమాజంలో ఓ ప్రత్యేక గౌరవం ఉంటుంది. అలాగే,  ఆలిండియా సర్వీసులు, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ (ప్రొబేషన్) సర్వీసు నిబంధల ప్రకారం ఏ అధికారి అయినా నిబంధలకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు  తేలితే వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు. ఇన్ని ఆరోపణల్లో చిక్కుకున్న పూజా ఖేడ్కర్ ఐఏఎస్‌గా కొనసాగడంపై ఇప్పుడు అనుమానాలు తెలుత్తుతున్నాయి. ఆమె సర్టిఫికెట్లన్నిటినీ పరిశీలించడానికి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. నిబంధనల ప్రకారం పూజాపై ఆరోపణలు గనుక రుజువైతే ఆమెను ఐఏఎస్‌కు అనర్హురాలిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే, తనను తొలగించడాన్ని ఆమె క్యాట్, జాతీయ ఓబీసీ కమిషన్‌లలో సవాలు చేయవచ్చు. ఇటీవలి కాలంలో ఏ ఐఏఎస్ అధికారి కూడా ఇన్ని వివాదాల్లో చిక్కుకున్న దాఖలాలు లేవు.