22-03-2025 07:12:59 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శనివారం అసెంబ్లీ సమావేశాల్లో తన గళం వినిపించారు. నియోజకవర్గంలో పలు మండలాల్లో ఉన్నటువంటి, అనేక సమస్యలను ప్రస్తావించారు. ఈ మేరకు నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉండగా, కవ్వాల్ టైగర్ జోన్ లో అటవీ అధికారులు అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అడవి ప్రాంతాల్లో త్రీఫేస్ కరెంట్ అందించడానికి అటవీ అధికారులు అడ్డుకొని స్థానికులను ఇబ్బంది పాలు చేస్తున్నారని అన్నారు.
కడెం మండలం గంగాపూర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో త్రీఫేస్ విద్యుత్ సరఫరా ఇప్పటికి లేకపోవడం విడ్డూరమని అన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తయినప్పటికీ, అటవీ అధికారుల అడ్డంకులతో సమస్య కొలిక్కి రావడంలేదని, నియోజకవర్గంలో అనేక చోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి ఆధ్యాపకులకు 12 నెలలుగా జీతం ఇవ్వడం లేదని, జీతం ఇచ్చి వారిని ఆటో రెన్యువల్ పద్ధతిలో ఎంపిక చేసుకోవాలని, ఆయన అసెంబ్లీలో తన గళం వినిపించారు.