calender_icon.png 18 January, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జా కోరల్లో ఖానాపూర్ చెరువు

01-09-2024 01:41:02 AM

  1. 189 ఎకరాల్లో 75 ఎకరాలకు పైగా కబ్జా
  2. చెరువును ఆక్రమించి నిర్మాణాలు
  3. చెత్తకుప్పగా బతుకమ్మ ఘాట్
  4. చెరువులో కలుస్తున్న మురుగు నీరు

ఆదిలాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): సాగు, తాగు నీరుకు ఉపయోగపడిన ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న ఏకైక ఖానాపూర్ చెరువు ఆక్రమణకు గురవుతూ చిన్న కుంటగా మారుతున్నప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. దీంతో యథేచ్ఛగా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణ నడిబొడ్డున ఉన్న ఖానాపూర్ చెరువు ఒకప్పుడు 189 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. సుమారు 75 ఎకరాలకు పైగా కబ్జాకు గురై ప్రస్తుతం 114 ఎకరాలకే పరిమితమైనట్లు అధికారుల అంచనా. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో భూగర్భజలాల పెరుగుదలకు ఉపయోగపడే ఈ చెరువు.. క్రమంగా ఆక్రమణకు గురవడంతో  స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వందకుపైగా ఎకరాల విస్తీర్ణంతో ఆయకట్టు అన్నదాతలకు సాగునీరందించిన చెరువు మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. 

చెరువులోనే ఇండ్ల నిర్మాణం

ప్రస్తుతం 114 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును కూడా పూడ్చుతూ ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఖానాపూర్ కాలనీ వైపు కొంత భాగంలో ఏకంగా చెరువులోనే ఇండ్ల నిర్మాణం చేపట్టడంతో వరాకాలంలో ఇళ్లల్లోకి వరద నీరు చేరుతున్నది. దీంతో ఇళ్లు తడిసి కూలిపోతున్నాయి. చెరువులో ఇండ్లు నిర్మించుకున్న పేదలకు ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామన్న గత ప్రభుతం ఆచరణలో పెట్టకపోవడంతో అక్కడే ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తున్నారు. 

చెరువు నిండా గుర్రపు డెక్క

వందలాది మత్స్యకారులకు జీవనోపాధి కల్పించే ఖానాపూర్ చెరువు ఒకవైపు ఆక్రమణలకు తోడుగా మరోవైపు గుర్రపు డెక్క, చెత్తచెదారంతో కూరుకుపోతోంది. పట్టణానికి చెందిన వివిధ కాలనీల నుంచి వచ్చే మురుగునీరు చెరువులో చేరడంతో  దుర్గంధం వెదజల్లుతున్నది. దీంతోపాటు చెరువులో చేపలు సైతం మృత్యువాత పడుతున్నాయి. చేపల వేటతో ఉపాధి పొందే మత్స్యకారులకు తీవ్ర నష్టం జరుగుతున్నది. చెరువును సుందరీకరించి, మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చడం కోసం గత ప్రభుతం లక్షలాది రూపాయలు వెచ్చించినా ఫలితం లేకుండా పోతోంది. 

ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి

ఖానాపూర్ చెరువు ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఇటీవల జరిగిన దిశ సమావేశంలో కలెక్టర్ ఆదేశాల మేరకు నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి చెరువు ఆక్రమణలపై దృష్టి పెట్టాం. చెరువు చుట్టూ ఇల్లు నిర్మించుకున్న పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, చెరువును కాపాడుతాం.

 ఖమర్ హైమద్, 

మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్