calender_icon.png 23 October, 2024 | 9:01 AM

ఖమ్మం.. సాయుధ పోరాట గుమ్మం

17-09-2024 05:14:51 AM

  1. సాయుధ రైతాంగ పోరాటంలో కీలకంగా జిల్లా పాత్ర 
  2. దళ కమాండర్లు, సభ్యులుగా సాధారణ ప్రజలు 
  3. తుపాకులు ఎక్కుపెట్టి మీర మహిళల పోరుబాట 
  4. రజాకార్ ఖాసీం రిజ్వీ సైన్యానికి చిక్కి 500 ప్రాణాలు బలి

ఖమ్మం, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పాత్ర మరువలేనిది. ఇక్కడి నుంచి ఎంతో మంది ఉద్యమ బాట పట్టారు. మహిళలు సైతం తుపాకీలు పట్టి పోరాటంలో భాగస్వాములయ్యారు. ఆ పోరాటానికి పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు వంటి ఉద్ధండ నేతలు నాయకత్వం వహించారు. 1946 నుంచి 1951 వరకు జరిగిన ఈ పోరాటంలో దాదాపు జిల్లా నుంచి 500 మంది అశువులు బాశారు. బోనకల్, పెద్ద బీరవల్లి, మధిర, మీనవోలు, అల్లీనగరం, ఎర్రుపాలెం, బ్రాహ్మణపల్లి, మడుపల్లి, రాపల్లి, తూటికుంట్ల, పొద్దుటూరు, కుర్నవల్లి, గోవిందాపురం, పిండిప్రోలు, బయ్యారం, ఇల్లెందు, గువ్వలగూడెం, గోకినేపల్లి, గార్ల, తనికెళ్ల తదితర గ్రామాలు నాడు ఉద్యమ కేంద్రాలుగా ఉన్నాయి.

ప్రజలకు మంచికంటి రాంకిషన్‌రావు, కొమరయ్య, గంగవరపు శ్రీనివాసరావు, రామనాథం, కేఎల్ నర్సింహారావు, వాసిరెడ్డి వెంకటపతి, వెంపటి రామకోటయ్య, బోడేపూడి వెంకటేశ్వరరావు, రావెళ్ల జానకీరామయ్య, దేవూరి శేషగిరిరావు, వీరమాచినేని ప్రసాద్, రేగళ్ల చెన్నారెడ్డి తదితర నేతలు దిశానిర్దేశం చేశారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు, చండ్ర రాజేశ్వరరావు, భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, రాయల వెంకటనారాయణ, నల్లమల గిరిప్రసాద్, సర్ధార్ జమలాపురం కేశవరావు, బొమ్మకంటి  సత్యనారాయణ వంటి నేతలెందరో పోరాటాలకు రూపకల్పన చేశారు. పిండిప్రోలుకు చెందిన రాయల వెంకటనారాయణ దళ కమాండర్‌గా పని చేశాడు.

పులి రామయ్య, రాయల జగ్గయ్య, రాంబాయమ్మ, పద్మనాభుల పుల్లయ్య, దొడ్డా జానకీరామయ్య, దొండేటి నారయ్య, కమ్మకోమటి రంగయ్య, కమ్మకోమటి వీరయ్య పోరాటంలో పాల్గొని అమరులయ్యారు. చిరునోములకు చెందిన రావెళ్ల జానకీరామయ్య ఆంధ్ర మహాసభ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. లక్ష్మీపురానికి చెందిన మల్లెల వెంకటేశ్వర్లు దళ కమాండర్‌గా పనిచేశారు. గోవిందాపురానికి చెందిన తమ్మారపు గోవింద్, చుండూరు నర్సింహారావు, జొన్నలగడ్డ  రామయ్య పోరులో పాల్గొన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అమరుల జాబితా వందల సంఖ్యలో ఉంటుంది.

నెత్తుటి మరక ‘అల్లీనగరం విధ్వంసం’..

మధిర ప్రాంతం నుంచి సాయుధ పోరాటంలో భాగస్వాములవుతున్న గ్రామస్తులపై రజాకార్లు దమనకాండకు పాల్పడ్డారు. అల్లీనగరం పక్కనే ఉన్న మడుపల్లి, మీనవోలులో ఎన్నో ఇండ్లను ధ్వంసం చేశారు. ఆస్తులు దోచుకున్నారు. దిక్కుతోచని స్థితిలో గ్రామస్తులు  పారిపోయి ఆంధ్రా సరిహద్దులోని మాచినేనిపాలెంలో తలదాచుకున్నారు. అల్లీనగరం సమీపంలోని మోటమర్రి మిలటరీ కేంద్రంపై ఉద్యమకారులు గెరిల్లా దాడి చేసి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత రజాకార్లు సైన్యంతో కలిసి అల్లీనగరానికి వచ్చి ఊరు మొత్తాన్ని తగులబెట్టారు. మీనవోలులో రజకార్లపై గ్రామస్తులు తిరగబడ్డారు. దీంతో రజాకార్లు కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో మీనవోలుకు చెందిన ఏడుగురు మృతిచెందారు. పాల్వంచ తాలూకాలోని గుండాల క్యాంపుపై నర్సంపేట తాలూకా జెండాగట్టు, పర్కాల తాలూకా జంగేడు, కారేపల్లి, బయ్యారం, ఆళ్లపల్లి, కొత్తగూడెం, కంబాలపల్లి, చంద్రగూడెంలో గెరిల్లా దళాలు, మిలిటరీ పోలీస్ దళాలకు మధ్య భీకర యుద్ధం జరిగింది. ఖాసీం రిజ్వీ అనుచరుల దౌర్జన్యాలకు బయ్యారం, ఇల్లెందు, గార్ల  తదితర ప్రాంతాల్లో  సుమారు 50 మంది వరకు తుపాకులకు బలయ్యారు. గార్ల రైల్వే స్టేషన్‌ను  రజ్వీ సైన్యం తమ ప్రధాన ప్రయాణ కేంద్రంగా మార్చుకున్నాయి.