రూ.వెయ్యి కోట్లతో ఖమ్మం-కోదాడ రోడ్డు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): జాతీయ రహదారులకు అనుసంధానంగా ఖమ్మం ఓఆర్‌ఆర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ ముజామిల్ ఖాన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
రూ.వెయ్యి కోట్లకు పైగా నిధులతో ఖమ్మం 31 కి.మీ.ల జాతీయ రహదారిని పూర్తి చేస్తామన్నారు. ఖమ్మం జాతీయ రహదారి ఉగాది వరకు పూర్తి చేస్తామని తెలిపారు. ఖమ్మం ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అత్యధిక జాతీయ రహదారులు ఉన్న జిల్లాగా ఖమ్మం ఆవిర్భవిస్తుందని అన్నారు.
చట్ట ప్రకారం ఆక్రమణల తొలగింపు
చట్ట ప్రకారం ఖమ్మం నగరంలో ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటా మని మంత్రి తెలిపారు. తెల్లరేషన్ కార్డుల్లేని రైతులకు రుణమాఫీ అమలుకు రైతు కుటుంబాల నిర్ధారణ సర్వే చేపట్టామని, దీని ప్రకారం అర్హులకు రుణమాఫీ వర్తింపజేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. ఆయిల్ ఫాం సాగుకు రైతులు ముందుకు రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
ఖమ్మంలో మంత్రి పర్యటన
ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల ప ర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ కల్లు గీత కార్మికుల సహకార సంస్థ ఆధ్వర్యంలో వంద మంది కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్లను పంపిణీ చేశారు. ఖమ్మం మార్కెట్‌ను తనిఖీ చేశారు.
పెసర్ల కొనుగోలు కేంద్రాల ను సందర్శించి, మద్దతు ధర, సమస్యల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల వరదలకు దెబ్బతిన్న ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి పునరుద్ధరణ పనులను మంత్రి తుమ్మల పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు.
ఖమ్మం వేగంగా కోలుకుంటుంది
వరద నష్టం నుంచి ఖమ్మం వేగంగా కోలుకుంటున్నదని మంత్రి అన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు సరఫరా వేగవంతంగా పునరుద్ధరించినట్టు తెలిపారు. ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి పునరుద్ధరణకు 100 రోజులు పడుతుందని తెలిపారు. వరద నష్టం కింద కేంద్రం నుంచి సాయం అందలేదన్నారు.