- మరోసారి మున్నేరుకు వరద పోటు
- వణుకుతున్న వరద ప్రభావిత ప్రాంతాలు
- పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులు
- మున్నేరు వంతెనపై రాకపోకలు నిలిపివేత
- వరద ప్రాంతాల్లో మైకులతో హెచ్చరికలు
- నగర నడిబొడ్డున కాలనీల్లోకి కూడా వరద నీరు
- హుటాహుటిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి
ఖమ్మం, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): శనివారం అర్ధరాత్రి నుంచి ఖమ్మం జిల్లాలో కుంభ వృష్టిగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఖమ్మం ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొన్నారు. మున్నేరు పరివాహాక ప్రాంతాలతో పాటు నగర వాసులు భయంతో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. విడవకుండా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువన మహబూబాబాద్, కేసముద్రం, బయ్యారం ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలకు ఖమ్మం వద్ద మున్నేరు ప్రమాదకరస్థాయిలో ప్రవాహిస్తుంది.
దాదాపు లక్ష క్యూసెక్కులకు పైగా వరద ఇక్కడ ఉండటంతో మున్నేరు శివారు ప్రాంతాలైన బొక్కలగడ్డ, మోతీనగర్, ప్రకాశ్‌నగర్, సార థినగర్, ఆర్టీసీ కాలనీ, జలగంనగర్, నాయుడుపేట, వెంకటేశ్వరనగర్ తదితర ప్రాంతాలు మళ్లీ జలమయం అయ్యాయి. అప్రమత్తమైన అధికారులు, పోలీస్ శాఖ మున్నేరు పరివాహాక ప్రాం తాల్లోని ముంపు కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు బలవంతంగా తరలించారు. మైకుల ద్వారా హెచ్చరికలు జారీచేస్తూ అందరినీ ఇళ్లు ఖాళీ చేయించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
మున్నేరు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
ప్రస్తుతం మున్నేరు 16 అడుగులు దాటి ప్రవహిస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. వరద 24 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీచేస్తారు. జోరుగా కురుస్తున్న వర్షాలతో మున్నేరు శివారు ప్రాంతాలతోపాటు నగర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న కవిరాజ్‌నగర్, ఇల్లెందు క్రాస్‌రోడ్డు ఏరియాలోనూ ఇళ్లల్లోకి వరద నీరు చేరింది.
ఖమ్మానికి భట్టి, పొంగులేటి
వరద సమచారం అందగానే హైదరాబాద్‌లో ఉన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవిన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హుటాహుటిన శనివారం అర్ధరాత్రినే ఖమ్మంకు చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, యుద్ధప్రాతిపదికన ముంపు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు దగ్గరుండి తరలించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, భయపడాల్సిన పని లేదని, ధైర్యంగా ఉండాలని ప్రజలకు భరోసా కల్పి ంచారు. ఈ నేపథ్యం లో మంత్రులు, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, అధికారులు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.
రైలుపట్టాల కింద వరద
ధ్వంసలాపురం కాలనీని ఆనుకుని ప్రవహిస్తున్న మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. పక్కనే ఉన్న రైల్వే లైన్ వద్దకు కూడా భారీ ఎత్తున వరద నీరు చేరింది. రైలు పట్టాల కింద నుంచి వరద ప్రవహిస్తుంది. ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, నిత్యావసరాలు అందిస్తున్నారు. నగరంలో 39 పునరా వాస కేంద్రాలు నడుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిండంతో జనం హడలెత్తిపోతున్నారు. అప్పటి వరకు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకునేలా అధి కారులు చర్యలు తీసుకుంటున్నారు.
పూర్తిగా వర్షాలు తగ్గిన తర్వాతనే వారిని వారివారి ఇళ్లల్లోకి అనుమతించాలని, రోడ్లన్నీ బ్లాక్ చేశారు. మున్నేరు వంతెనపై రాకపోకలను శనివారం అర్ధరాత్రి నుంచి నిలిపేశారు. వరద ప్రాంతాల్లోని అంతర్గత రహదారులను కూడా అధికారులు దిగ్బంధం చేసి, ఎవరిని వాటిల్లోకి అనుమతించకుండా మూసేశారు. మంత్రుల ఆదేశాలతో అధికారులు వరద ప్రాంతాల్లో తిరుగుతూ కాపలాకాస్తున్నారు. ఏ క్షణం ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉన్నారు.