-గన్నమరాజు గిరిజా మనోహరబాబు
9949013448
“గ్రైవేయ కంకణాంగదహార
కుండలప్రభ లలిత స్ఫూర్తి బరిఢ విల్ల
నవరత్న కీలితోన్నత కిరీటద్యుతులాశావ
కాశంబులలమి కొనగ
గటి విలంబిత హేమకాంచీ విలగ్నమై
రాజిత పీతాంబరంబు మెఱయ
శ్రీవత్సకౌస్తుభ శ్రీరమాయుక్తమై తులసి
కాదామంబు తొంగలింప
నతిరయంబున గరుడవాహన సమేతు
డగుచు విష్ణుండు శంఖచక్రాది విశ్రు
తాయుధంబుల ధరియించి యవనిపతికి
తత్‌క్షణంబున నచట ప్రత్యక్షమయ్యె.”
అంటూ ‘మత్స్య పురాణం’లో శ్రీమన్నారాయణున్ని స్తుతిస్తూ హరిభట్టు రచించిన ఈ సీసపద్యం సంస్కృత భాగవత శ్లోకాన్ని అద్భుతంగా అనుసరించి రచించినట్లుగా పలు ప్రమాణాలతో సుప్రసిద్ధ సాహితీ పరిశోధకులు, విద్వన్మూర్తులు ఏల్చూరి మురళీధర రావు నిర్ధారించారు. ఇటువంటి పద్యమే ఒకటి బొప్పరాజు గంగన రచించిన భాగవతం భాగంలో ఉందని కూడా వివరిస్తూ, ‘ఇది గంగన పద్యాన్ని అనుసరించిన పద్యం కాదనికూడా’ ఆయన ప్రమాణీకరించారు.
హరిభట్టు కూడా భాగవతాన్ని బాగా అధ్యయనం చేసిన కవి గనుక ఆయన ‘మత్స్య పురాణం’లో ఆ ప్రభావంతో రాసిందే తప్ప గంగన పద్య చ్ఛాయ కాదని విస్పష్టమైన రీతిలో మురళీధర రావు చెప్పారు. ఇది హరిభట్టు పద్య రచనా ప్రతిభకు దర్పణం పడుతున్నది.
కాల నిర్ణయం
ఖమ్మం ఆదికవిగా గౌరవం పొందిన హరిభట్టు క్రీ.శ. 1510 ప్రాంతం వానిగా సాహిత్య చరిత్రకారులు పేర్కొన్నారు. ఆయన ‘నారసింహ పురాణం’ (ఉత్తర భాగం) ‘వరాహ పురాణం’, భాగవతంలో షష్ఠ, ఏకాదశ, ద్వాదశ స్కంధాలను రచించినట్లు తెలుస్తున్నది. హరిభట్టు కాలం 1510 ప్రాంతంగా నిర్ణయించడానికి ఆయన రచన అయిన ‘నారసింహ పురాణాన్ని’ అంకితం తీసుకున్న ప్రోలుగంటి రంగయ మంత్రి అప్పటి పాలకుడైన హావళి చినఓబళ రాజుకు మంత్రి కావడమేనని సాహితీవేత్తలు భావించారు.
ఈ పాలకునికి చెందిన శాసనాలు 1547 కాలానికి చెందినవి లభ్యమవుతున్నాయి. దానినిబట్టి హరిభట్టు కాల నిర్ణయం చేశారు. అంతేగాకుండా, ఈయన తండ్రి అయిన రాఘవార్యుని ‘చంద్రనామాంక విద్వన్మణి’గా కవి పేర్కొన్నాడు. అంటే, ఆయన పేరు ‘రామచంద్రుడు’ అని అర్థమవుతున్నది. 1513 సంవత్సరంలో రాఘవ నాయకుడు “శ్రీరామ చంద్ర భట్టోపాధ్యాయుల పుత్రులైన హరిభట్టోపాధ్యాయులకు ‘చిన్నపల్లె’ అను గ్రామం దానం చేసినట్టు” ఒక తామ్ర శాసనం కూడా ఉంది.
చరిత్రకు అతిముఖ్యమైన ఆధారాలు శాసనాలే గనుక హరిభట్టు కాలాన్ని నిర్ణయించే క్రమంలో సాహిత్య చరిత్రకారులు ఈ మార్గంలో ప్రయత్నించారు. దీనివల్ల కవులకు చెందిన అనేక సత్యాలు నిర్ధారింపబడతాయి. వీటి ఆధారంగా హరిభట్టు ఆశ్వాసాంత గద్యలో పేర్కొన్న ఆయన జనకుని నామం ఇదేననీ, ఆయన కాలం 1510 ప్రాంతమేననీ స్పష్టంగా నిర్ధారించే అవకాశం కలిగింది.
విభిన్నమైన రచనగా ‘వరాహ పురాణం’
తెలుగు సాహిత్యంలో తొలి జంటకవులుగా కీర్తిని అందుకున్న నంది మల్లయ, ఘంట సింగనలు ‘వరాహ పురాణము’ను రచించారు. హరిభట్టుకూడా ‘వరాహ పురాణం’ రాశాడు. ఐతే, ఈయన రచన ఆ జంటకవుల రచనకంటే భిన్నమైంది. ఈ గ్రంథం పూర్వ భాగంలో (కైవల్య ఖండం) అవతార సంబంధి కథలు ఉన్నాయి.
వరాహావతార కథ విస్తారంగాను, మిగిలిన అవతార కథలన్నీ సంగ్రహంగానూ చెప్పడం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో అనేక పురాణాంశాలు, వివిధ వ్రత మాహత్మ్యాలు, అనేక స్తోత్రాలు, పలు రాజనీతి విషయాలు, కర్మ భక్తి జ్ఞాన సంబంధ విషయాలెన్నో కనిపిస్తాయి. కానీ, హరిభట్టు రచించిన ‘మత్స్య పురాణం’లో మాత్రం ‘విష్ణు ధర్మోత్తర ఖండ’ విషయమే అయినా దేవలుడు, పుండరీకుడు, విష్ణుదత్తుడు మొదలైన వారి ఉపాఖ్యానాలు ఉన్నాయి. ఇది ‘శ్రీరంగనాథాంకిత’మైన రచన.
ఇంతకు పూర్వం ప్రస్తావించుకున్నట్లు ‘ఉత్తర నారసింహ పురాణం’ ప్రోలుగంటి రంగయకు అంకితం కావడంలో ప్రధాన పాత్ర హరిభట్టు కుమారుడైన ‘రాఘవ మనీషి’దిగా చారిత్రకులు అభిప్రాయపడ్డారు. దీనిని హరిభట్టు చివరి రచనగా గుర్తించారు. ఖమ్మం ప్రాంతపు వ్యక్తిగా గుర్తింపు పొందిన ఈ కవి ‘వరాహ పురాణాన్ని’ కంబం మెట్టు (ఈనాటి ఖమ్మం) కరణమైన ‘కొలిపాక ఎఱ్ఱన’కు అంకితం చేశాడు. ఖమ్మంలోని గుట్టపై నెలకొని ఉన్న నరసింహుని భక్తునిగా హరిభట్టు కీర్తిని పొందాడు.ఒక విధంగా ఈయనను ‘ఖమ్మం ప్రాంతపు ఆదికవి’గా కూడా కీర్తించారు.
అష్ట ఘంటావధాన పరమేశ్వరుడు
మహాకవిగా ‘అష్ట ఘంటావధాన పరమేశ్వరు’నిగా కీర్తిని పొందిన హరిభట్టు తన ‘వరాహ పురాణం’లో ప్రత్యేకంగా కృతిపతి నోట
“అష్ట ఘంటావధాన విశిష్ట బిరుద!
నీవు రచియింపదలచిన నిరుపమార్థ
రమ్యమగు నీ వరాహ పురాణ కావ్య
మంకితము చేయు నా పేరనభిమతముగ”
అని పలికించినాడు. అయితే, ఈ బిరుదాన్ని ఎవరు హరిభట్టుకు ప్రదానం చేశారో తెలియదని సాహిత్య చరిత్రకారులు పేర్కొన్నారు. ఆయన ఖమ్మం ప్రాంతానికి చెందిన కవి గనుక ఖమ్మం పట్టణాన్ని ఒక సీస పద్యంలో వర్ణించాడు. ఖమ్మం పూర్వ నామం (కంభం మెట్టు) పేరుతోనే ఈ కావ్యంలో పద్య రచన సాగింది.
“వరుణ దిగ్వీధి నే పురమున బ్రవహించె
పావన సలిత సంపన్న మున్న
దీపించెనే పురి గోపికా మానసా
స్పదవర్తి చెన్నగోపాలమూర్తి
భాసిల్లె నేవీట బ్రహ్లాదభక్తివి
శ్రావణికొండ నృసింహ శార్జపాణి
యేపట్టణంబున జూపట్టె హితపద్మ
హేళి వీరేశ బాలేందు మౌళి
చతుర చతురంగ బలరత్న సౌధయూధ సాలగోపుర
తోరణ సకల వర్ణ
పౌర వారాంగనాజన ప్రముఖ వస్తు మేదురం బట్టి
కంబము మెట్టుపురము”
అంటూ వర్ణించడంలో కవికున్న స్వస్థలంపైని ప్రేమ ద్యోతకమవుతున్నది.
‘కిరివర దంష్ట్రా దండో
పరిభాగమందు నాత పత్రము కరణిన్
ధరణీ చక్రము దనరెను
సురశైలము పసిడి గుబ్బ చొప్పున నొప్పెన్’
అంటూ అపురూపమై, సుసంపన్నమైన, ఆలంకారిక రీతిలో శోభాయమానంగా తన రచనలైన ‘వరాహ పురాణము’, ‘మత్స్య పురాణము’ రచించిన హరిభట్టు తన కృతులను వచన కావ్యాలుగా పేర్కొన్నాడు. కానీ, ఆయన రచనలు సరళ సుందరము లైన పద్య గదాల్యలతో గొప్ప చంపూ కావ్యాలుగానే రూపొందాయి.
విష్ణుమాయకు లోనైన ప్రహ్లాదుడు
హరిభట్టు అసలు పేరు ‘హరిహరభట్టు’ అని కూడా కొందరు పేర్కొన్నారు. ఏ రచన చేసినా అందులో ఇంతకు పూర్వపు రచనలకన్నా విశిష్టంగా రచించే ప్రయత్నం చేసిన కవి హరిభట్టు. ‘వరాహ పురాణం’ వలెనే ‘ఉత్తర నారసింహం’లోకూడా కొన్ని ప్రత్యేకతలను తన కవిత్వంలో ప్రకటించిన హరిభట్టు మహాభక్తుడైన ప్రహ్లాదుని చిత్రిస్తూనే, “యౌవనంలో విష్ణుమాయ కారణం గా కొన్ని విపరీత భావాలను ప్రదర్శించినట్లు” చిత్రించాడు.
“ప్రహ్లాదుడు మహాభక్తుడైనా యౌవనంలో కొందరి దుర్బోధలవల్ల రక్తుడై ప్రవర్తించినట్లు” ఈ కృతిలో కనిపిస్తుంది. ఇది తనకు కన్యలు అర్పించిన వామనాసురుని కారణంగా ప్రహ్లాదుడు వైకుంఠంపైనే దాడి చేసినట్లు చెప్పడం జరిగింది. తదనంతరం విష్ణుమాయ తొలగడం వల్ల తాను పశ్చాత్తప్తుడై మహాభక్తుడుగానే స్వామిని సేవించుకుంటాడు. ఇంకా ఈ ప్రహ్లాదుడు మధు పాన గోష్ఠికూడా జరిపినట్టు వర్ణించాడు.
కావ్య మర్యాదను అనుసరించి పుర, ఋతు, యుద్ధ వర్ణనలతోపాటు ఈ గోష్ఠి వర్ణన కూడా చోటు చేసుకోవడం విశేషం. ఒక స్వతంత్ర కావ్యంగా రూపొందిన రచనగా ఈ గ్రంథం ప్రశంసలు అందుకొంది.
అముద్రితాలుగా ‘భాగవతపు భాగాలు’
హరిభట్టు రచనలుగా పేర్కొనే ‘భాగవతపు భాగాలు’ అముద్రితాలైనా లక్షణ గ్రంథాలవల్ల, కొన్ని ప్రత్యేక సంకలనాలవల్ల లభ్యమవుతున్న పద్యాలనుబట్టి, ఇతడు రచించిన భాగవత పద్యాలు ప్రతిభావంతమైన రచనగా భాగవతాన్ని నిలిపాయి. మహా పరిశోధకులు, సాహిత్య చరిత్రకారులు అయిన చాగంటి శేషయ్య హరిభట్టును గురించి తమ ‘ఆంధ్రకవి తరంగిణి’లో మరికొన్ని విషయాలను పేర్కొన్నారు. నేడు మనకు లభిస్తున్న భాగవతంలో వెలిగందల నారయ రచించిన భాగాల్లో కొన్ని పద్యాలు హరిభట్టువేనని పలు ప్రమాణాలతో విశ్లేషించి చూపారు.
ఆరుద్ర కూడా ‘సమగ్రాంధ్ర సాహిత్యం’లో ఈ విషయాన్నే నారయ రచనా మార్గాన్ని, హరిభట్టు రచనా శైలినిబట్టి సమర్థించారు. హరిభట్టు రచించిన భాగవత భాగాలు లభించి ఉంటే మరెన్నో కొత్త కోణాలు ఆవిష్కృతమై ఉండేవి. ఏమైనా, ‘తెలుగు సాహితీ ప్రపంచంలో తనకంటూ ఒక విశేష స్థానాన్ని సాధించుకున్న కవి హరిభట్టు’ అని నిస్సంశయంగా పేర్కొనవచ్చు.