calender_icon.png 26 December, 2024 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలేకరుల సమావేశంలో ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి

04-12-2024 08:47:59 PM

ఖమ్మం (విజయక్రాంతి): రాజీమార్గమే రాజ మార్గమని, రాజీపడతగ్గ కేసులలో రాజీ పడి సత్వర న్యాయం పొందాలని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్ద  చైర్మన్ టి.రాజగోపాల్ అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా కోర్టులోని న్యాయ సేవాధికార సంస్ధ హాల్లో ఈనెల 14వ తేదీన చేపట్టబోయే జాతీయ లోక్‌ అదాలత్ నిర్వహణపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ.. లోక్ అదాలత్ లను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవాలన్నారు. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కేసులను రాజీతో ముగించేందుకు ఇలాంటి లోక్ అదాలత్‌లు ఉపయోగపడతాయన్నారు. ఎలాంటి ఫీజు లేకుండా న్యాయ సేవా సంస్ధ సహకారంతో కేసులను పూర్తి చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

కేసులు రాజీ చేసుకోవడం ద్వారా అప్పీలు చేసుకోవడం ఉండదని, కోర్టు చుట్టూ తిరిగితే డబ్బు, సమయం వృధా అవుతుందని, లోక్ అదాలత్ ద్వారా కేసులను త్వరితగతిన  పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. గత లోక్ అదాలత్ ద్వారా జిల్లాలో 10712 కేసులు పరిష్కరించి, రాష్ట్రంలో 7వ స్దానంలో నిలిచామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని వివిధ కోర్టుల్లో 6277 కేసులు గుర్తించామని, ఇంకా కేసులు గుర్తించి, గత లోక్ అదాలత్ కంటే ఎక్కువ కేసులు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈనెల 14న వివిధ కోర్టుల్లో లోక్ అదాలత్ ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.

క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్ధి విభజన కేసులు, వైవాహిక  జీవితానికి  సంబంధించిన కేసులు, బ్యాంక్  రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాదం, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసులు, ఇతర రాజీపడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. రాజీ కేసుల్లో కక్షిదారుల మధ్య సుహృద్బావ వాతావరణంతో పాటు, గ్రామాల్లో ప్రశాంతత నెలకొంటుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి చంద్రశేఖరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నెరేళ్ల శ్రీనివాసరావు, న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.