calender_icon.png 20 September, 2024 | 9:12 AM

ఆయిల్‌పాం హబ్‌గా ఖమ్మం!

19-09-2024 02:14:39 AM

  1. జిల్లాలో మరో రెండు ఆయిల్‌పాం ఫ్యాక్టరీ నిర్మాణం 
  2. ముడి పామాయిల్ దిగుమతిపై సుంకం పెంపుతో మన రైతులకు మంచి రోజులు
  3. మంత్రి తుమ్మల కృషితో ఆయిల్‌పాం రైతులకు మహర్దశ 

ఖమ్మం, సెప్టెంబర్ 1౮ (విజయక్రాంతి): ఆయిల్‌పాం సాగుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా హబ్‌గా మారనున్నది. ఆయిల్‌పాం సాగుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషికి తోడు తాజాగా కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం పెంచడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆయిల్‌పాం తోటలు సాగవుతున్నాయి. సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో మరో రెండు ఆయిల్‌పాం ఫ్యాక్టరీల నిర్మాణాన్ని ప్రారంభించింది. దాదాపు రూ.500 కోట్ల ఖర్చుతో కొణిజర్ల మండలంలో ఒకటి, వేంసూరు మండలంలో మరొకదాన్ని నిర్మిస్తున్నారు.

వచ్చే సంవత్సరం కల్లా ఈ రెండు ఫ్యాక్టరీలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే దమ్మపేట మండలంలోని అశ్వారావుపేటలో ఫ్యాక్టరీ ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్న అశ్వారావుపేట ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోకి వెళ్లిపోయింది. భద్రాద్రి జిల్లాలో కొత్తగా అశ్వాపురం మ ండలం బీజే కొత్తూరు, ములకలపల్లిలో కూడా కొత్త ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల దాకా ఆయిల్ పాం సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా ఇవ్వడంతో రెండు జిల్లాల్లో మరింత విస్తీర్ణంలో సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.

కేంద్ర నిర్ణయంతో పరిస్థితి మెరుగు

ఆయిల్‌పాం సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నప్పటికీ మద్దతు ధర విషయంలో కొంత ఇబ్బందిపడ్డారు. తాజాగా కేంద్రం దిగుమతి సుంకం పెంపుపై తీసుకున్న నిర్ణయంతో రైతుల పరిస్థితి మెరుగుపడనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 80 వేల ఎకరాలకు పైగా ఆయిల్ పాం సాగు చేస్తున్నారు. అశ్వారావుపేట, దమ్మపేట, వేంసూ రు, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో పెద్ద ఎత్తున సాగవుతుంది. తాజాగా కొణిజర్ల, వైరా, తల్లాడ తదితర మండలాల్లో కూడా సాగుకు చర్యలు తీసుకున్నారు. డిసెంబర్ నాటికి కొత్త ఫ్యాక్టరీలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో ఫ్యాక్టరీ పరిధిలో అధిక విస్తీర్ణంలో ఆయిల్‌పాం సాగుకు ప్రభుత్వం ప్రొత్సాహాన్నిస్తుంది.

పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు ప్రాంతాల్లోని రైతులు ఆయిల్‌పాం గెలలను అశ్వారావుపేట ఫ్యాక్టరీకి తరలిస్తుంటారు. ప్రపంచ మార్కెట్‌లో ఆయిల్‌పాంకు గిరాకీ ఉండటంతోపాటు ఇండోనేషియా, మలేసియా దేశాలు ఈ పంటపై ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. 90 శాతం వాటా ఈ రెండు దేశాలదే. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా పామాయి ల్‌కు డిమాండ్ పెరగడంతో ఇక్కడ కూడా సాగు విస్తీర్ణం పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించి, సబ్సిడీలు ఇస్తూ రైతుల ను ప్రొత్సహిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో వచ్చిన హెచ్చు తగ్గుల వల్ల టన్ను గెల ధరలో పలు దఫాలుగా పెరగడం, తగ్గడం వల్ల రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారు. లాభదాయకమైన పంట కావడంతోపాటు లక్షల్లో ఆదాయం వస్తుండటంతో రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. 

ఫలించిన మంత్రి తుమ్మల కృషి 

ముడి పామాయిల్ దిగుమతి సుంకం 5.5 శాతం నుంచి 27.5 శాతానికి పెంచడం శుభపరిణామమని రైతులు పేర్కొంటున్నారు. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్బంలో ఈ విషయమై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చించారు. దీంతో తాజాగా దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. టన్నుకు రెండు వేల వరకు అదనపు ఆదాయం లభిస్తుందని అంటున్నారు. 

గతంలో ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడంతో ఆయిల్‌పాం గెల ల ధర పూర్తిగా పడిపోయింది. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రైతులతో కూడిన బృందం ఢిల్లీ వెళ్లి, కేంద్ర మంత్రులను కలిసి, లేఖలు అందజేయడంతోపాటు ధర్నా కూడా చేశారు. కేంద్రం నిర్ణ యంతో ఆయిల్‌పాం గెలల ధర రూ.1500 నుంచి రూ.1700 వరకు పెరుగుతుందని భావిస్తున్నారు.  

ఆయిల్‌పాం బోర్డు వచ్చేనా? 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా ఆయిల్‌పాం సాగవుతున్న నేపథ్యంలో ఆయిల్‌పాం బోర్డును ఏర్పా టు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి పెం చుతున్నారు. ఆయిల్‌పాం రైతు సంఘాల నేతలు గతంలో పలుమార్లు ఢిల్లీ వెళ్లి, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కలవడంతోపాటు లేఖలు కూడా అందజేసి వచ్చా రు. ఎంపీల ద్వారా ఒత్తిడి కూడా తీసుకువచ్చారు. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కూడా ఆయిల్‌పాం బోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చారు. తాజాగా కేంద్రం ఆయిల్‌పాం ముడి దిగుమతులపై సుంకాన్ని పెంచిన నేపథ్యంలో బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదనపై స్పందించాలని జిల్లాకు చెందిన రైతులు కోరుతున్నారు. 

దేశ వ్యాప్తంగా 16.80 లక్షల మెట్రిక్ టన్నుల పామాయిల్ దిగుబడి వస్తుండగా, అందులో తెలుగు రాష్ట్రాల నుంచి  16.20 మెట్రిక్ టన్నుల పామాయిల్ దిగుబడి వస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున దిగుబడి వస్తుండటంతో బోర్డు ప్రతిపాదన ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉంది. రాష్ట్రంలో సుమారు 2 లక్షల ఎకరాల కంటే పైగానే ఆయిల్‌పాం సాగవుతుంది.