calender_icon.png 27 September, 2024 | 6:54 AM

టూరిజం హబ్‌గా ఖమ్మం

27-09-2024 01:18:12 AM

శరవేగంగా ఖమ్మం రోప్‌వే 

భద్రాద్రికి ఆధ్యాత్మిక శోభ 

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

ఖమ్మం, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాను పర్యాటక గుమ్మంగా తీర్చిదిద్దుతానని, ఖమ్మం  పూర్వ వైభవం తీసుకొచ్చేలా రోప్‌వేను శరవేగంగా నిర్మిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  పేర్కొన్నారు. గురువారం సెక్రటేరియట్‌లో పర్యాటక అభివృద్ధి, రోప్‌వే పనులపై తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, ఎండీ ప్రకాశ్‌రెడ్డితో మంత్రి తుమ్మల సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ఖమ్మం  రోప్‌వే నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టాలని సూచించారు. రోప్‌వే బ్రిడ్జి లోయర్ పాయింట్ వద్ద పార్కింగ్ కోసం, యంత్రాల తరలింపు కోసం స్థలం విశాలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లోయర్ పాయింట్ నిర్మాణానికి లకారం చెరువు పరిసర ప్రాంతం అనువుగా ఉంటుందని అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. టూరిజం హబ్‌గా ఖమ్మం  మార్చాలన్నారు. నిధులను సమకూర్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. రోప్‌వేతో పాటు అమ్యుస్‌మెంట్ పార్కులు, హోటళ్ల నిర్మాణాలు, వాటర్ ఫాల్స్, హాళ్ల నిర్మాణం రెండో దశలో చేపట్టాలన్నారు.

మున్సిపల్ కమిషనర్, ఖమ్మం కలెక్టర్‌తో మాట్లాడి వెంటనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దక్షిణ అయోధ్య భద్రాద్రిలో ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భద్రాద్రిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కిన్నెరసాని ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామన్నారు. పాలేరు, వైరా రిజర్వాయర్‌లలో బోటింగ్ రిక్రియేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల చెప్పారు. నేలకొండపల్లి బౌద్ద స్ధూపం, రామదాసు ధ్యాన మందిరం కూసుమంచి శివాలయం టూరిజం సర్క్యూట్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు  మంత్రి వివరించారు. 

ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి రిపేర్లు షురూ

ఇటీవల వచ్చిన వరదలకు ధ్వంసమైన మున్నేరు ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి మరమ్మతు పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. నగరం లోకి రాకపోకల విషయంలో ఎంతో ముఖ్యమైన ఈ వంతెన మూతపడడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్రిడ్జిని సందర్శించి, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో గురువారం నుంచి ఆర్‌అండ్‌బి అధికారులు పనులు ప్రారంభించారు.