- కెనడాలోని ఓ ఆలయంలో హిందువులపై దాడి
- వారికే మద్దతుగా నిలిచిన కెనడా పోలీసులు!
- దాడులను ఖండించిన ప్రధాని మోదీ
- దాడులు ఆమోదయోగ్యం కాదన్న ట్రూడో
కెనడాలోని ఓ ఆలయంలో హిందువులపై దాడి
కెనడా ప్రభుత్వ అండతో ఖలిస్థానీ మద్దతుదారులు భారతీయులపై విషం కక్కుతున్నారు. తాజాగా కెనడాలోని బ్రాంప్టన్ నగరంలోని హిందూ దేవాలయం వెలుపల సోమవారం కొంతమంది ఖలిస్థానీ సానుభూతిపరులు హిందువులపై దాడులు చేశారు.
పోలీసులు సైతం హిందువులపైనే లాఠీ ఝుళిపించారు. ఈ ఘటనను భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం ఇలాంటి దాడులు ఆమోదయోగ్యం కాదన్నారు.
అట్టవా (కెనడా), నవంబర్ 4: భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు తీవ్రవాదులుగా గుర్తించిన ఖలిస్థానీలకు మద్దతుగా నిలుస్తున్న కెనడా ప్రధాని, అక్కడి ప్రభుత్వ వైఖరితో ఇరుదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారయ్యింది పరిస్థితి.
ఆదివారం కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఖలిస్థానీ మద్దతు దారులు ఓ హిందూ దేవాలయం వెలుపల విధ్వంసం సృష్టించారు. దేవాలయం వద్ద హిందువులతో వాగ్వాదం చేసుకోవడంతో పాటు వారిపై దాడికి దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు లోకి తీసుకువచ్చారు. ఈ సమయంలో సిక్కులకు మద్దతుగా నిలుస్తూ హిందువులపై పోలీసులు దాడి చేయడం గమనార్హం. దీనిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
హిందువులపైనే లాఠీ..
ఉద్రిక్తతలను అదుపు చేయడానికి వచ్చిన పోలీసులు హిందూ వర్గానికి చెందిన కొంతమందిని లాఠీలతో కొడుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో.. ఇలాంటి దాడులు ఆమోదయోగ్యం కాదన్నారు. కెనడాలో నివసించే ప్రతి ఒక్కరికీ వారివారి మతాభిమానాలను కొనసాగించే హక్కు ఉందని, ఓ వర్గం వారిని కించపరిచి, వారిపై దాడిచేసే సంస్కృతి సరికాదన్నారు.
అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అని ట్రూడో స్పష్టం చేశారు. అలాగే బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్.. నగరంలో హిందూ దేవాలయం వెలుపల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు విని ఆందోళన చెందానని చెప్పారు. కెనడాలో మత స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని, ఆ హక్కుకు భంగం కలిగించేవాళ్లని వదిలిపెట్టేది లేదన్నారు. హింసాత్మక చర్యలకు పాల్పడినవారిని త్వరలో గుర్తించి వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని మేయర్ స్పష్టం చేశారు.
మమ్మల్ని ఏం చేయలేరు: మోదీ
కెనడాలో హిందువులపై దాడిని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖండించారు. ఈ దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఆరోపించారు. కెనడాలోని భారత దౌత్యవేత్తలను బెదిరింపులకు గురి చేయడం పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. ఉగ్రవాదులు, వేర్పాటువాదుల హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత స్థుర్యైన్ని ఏమాత్రం తగ్గించలేవని, కెనడా ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
భద్రత పెంచాలి..
హిందూ ఆలయంపై భారత వ్యతిరేక శక్తులు హింసాత్మక ఘటనలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భారత హైకమిషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. కెనడియన్ అధికారులు ఇలాంటి ఈవెంట్లు జరుగుతున్న సమయంలో కఠినమైన భద్రతా చర్యలను అందించాలని ఎంబసీని ఇప్పటికే అభ్యర్థించామని భారత హైకమిషన్ అధికారి ఒకరు తెలిపారు.
అలాగే ఈ దాడిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. ఉగ్రవాదులు, వేర్పాటువాదులు చేస్తున్న హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్ని ప్రార్థన స్థలాలకు తగినంత రక్షణ ఉండేలా చూడాలని కెనడా ప్రభుత్వానికి పిలుపునిచ్చారు.
భారత ప్రభుత్వం కెనడా దేశంలో భారత పౌరుల భద్రత గురించి తీవ్ర ఆందోళనగా ఉందని జైశ్వాల్ తెలిపారు. ఆలయం లోపల సహాయక చర్యలకు శిబిరం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
కెనడాలో సిక్కుల ప్రాబల్యం..
భారత్‌లో ఖలిస్థానీ వేర్పాటువాదులను అణిచివేయడం ప్రారంభించడంతో విదేశాల్లో స్థిరపడ్డ పంజాబీల్లో కొందరు అతివాదులు.. ఖలిస్థానీ వేర్పాటువాదులకు ఆశ్రయం కల్పించడం, వారికి మద్దతుగా నిలవడం వంటి కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. కెనడా వేదికగా ఖలిస్థాన్ డిమాండ్ మొదలుపెట్టారు.
కెనడాలో దాదాపు 8లక్షల వరకు సిక్కులు అధికారికంగా నివసిస్తున్నారు. భారత్ తర్వాత సిక్కులు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతం కెనడానే. ఆ దేశ ప్రధాని ట్రూడో నేతృత్వంలోని ప్రభుత్వంలో 16 మంది ఎంపీలుండగా.. అందులో నలుగురికి క్యాబినెట్లోనూ చోటు కల్పించారంటే ఆదేశంలో వారిస్థానం ఏంటో అర్థం అవుతోంది.
ఆ దేశ రక్షణ మంత్రి హర్జిత్ సజ్జన్ కూడా సిక్కు మతస్థుడే కావడాన్ని బట్టి ఆ దేశ రాజకీయాల్లో వారి ఆధిపత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కెనడా రాజకీయ అండతో ఖలిస్థాన్ ఏర్పా టు కోసం పంజాబ్‌తో పాటు ప్రపంచమంతా ఓటింగ్ నిర్వహించి..
దానిని ఐరాస కు అందజేయడం ద్వారా ఖలిస్థాన్ గళాన్ని బలంగా వినిపించే దిశగా వేర్పాటువాదులు అడుగులేస్తున్నారు. జీ 20 సదస్సులో సైతం ట్రూడో ఖలిస్థానీలకు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
అసలేమిటీ ఖలిస్థానీ ఉద్యమం?
ఖలిస్థాన్ అంటే పరిశుద్ధ భూమి అని అర్థం. మతం ఆధారంగా సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ తోనే ఖలిస్థాన్ ఉద్యమం మొదలైంది. ఈ ఆలోచన భారత్‌లో బ్రిటిషర్ల పాల న కాలంలోనే మొగ్గతొడిగింది. దేశ విభజన సమయంలో ఇండియా, పాకిస్థాన్ విడిపోయినట్లుగానే.. భార త్, పాక్‌లోని పంజాబ్ ప్రాంతంతో సిక్కుల కోసం ప్రత్యేకంగా ఖలిస్థాన్ అనే దేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది.
అయి తే అప్పట్లో ఈ డిమాండ్‌ను పెద్దగా పట్టించుకోలేదు. అయినప్పటికీ ఖలిస్థాన్ డిమాండ్ పలుమార్లు తెరమీ దకు వస్తూనే ఉంది. 1970 ఈ వేర్పాటువాదంతో దశాబ్ధం పాటు పంజాబ్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే 1982లో సంత్ జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే నేతృత్వంలోని వేర్పాటువాదులు పంజాబ్ సహా దేశంలో పంజాబీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లలో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. అమృత్‌సర్ స్వర్ణ దేవాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఓ సమూహం హిందువులపై, ప్రభుత్వం సంస్థలపై దాడులకు తెగబడింది.