- టెలిగ్రామ్‌లో వైరల్ అయిన పోస్ట్
- ఆ దిశగా ఆరా తీస్తోన్న దర్యాప్తు సంస్థలు
ఢిల్లీ, అక్టోబర్ 21: ఆదివారం ఢిల్లీ ప్రశాంత్ విహార్‌లోని సీఆర్‌పీఎఫ్ స్కూల్ వద్ద బాంబు పేలిన ఘటన దేశ రాజధానిలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), నేషనల్ సెక్యురిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ), సీఆర్‌పీఎఫ్ బృందాలు దర్యాప్తు చేపట్టాయి.
పేలుడుకు నాటు బాంబు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఖలిస్థాన్‌కు మద్దతిచ్చే వేర్పాటువాదులను భారత ఏజెంట్లు టార్గెట్‌గా చేసుకున్నారని ఆరోపిస్తూ ప్రతీకారంగా ఈ పేలుడు జరిగిందని టెలిగ్రామ్‌లో ఓ పోస్ట్ వైరల్ అయింది. జస్టిస్ లీగ్ ఇండియా పేరుతో ఉన్న టెలిగ్రామ్ చానెల్ ఈ పోస్టును పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
ఫలితంగా ఈ దాడి వెనుక ఖలిస్థానీ వేర్పాటువాదుల హస్తం ఉండి ఉంటుందని దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఘటనకు, వేర్పాటువాదులకు మధ్య సంబంధాన్ని పరిశీలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
జస్టిస్ లీగ్ ఇండియా చానెల్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని టెలిగ్రాం సంస్థకు దర్యాప్తు బృందం లేఖలో కోరింది. అయితే టెలిగ్రాం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అధికారులు తెలిపారు. ఆదివారం జరిగిన పేలుడులో పాఠశాల ప్రహరీ, సమీపంలోని దుకాణాలు, వాహనాల అద్దాలు దెబ్బతిన్నాయి. కాగా, ప్రాణనష్టం జరగలేదు.