calender_icon.png 21 September, 2024 | 10:04 AM

కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం

17-09-2024 01:08:30 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మరికాసేపట్లో జరుగనుంది. హుస్సేన్ సాగర్ లోని నాలుగో నంబర్ క్రేన్ వద్దకు చేరుకున్న మహా గణనాథుడికి కమిటీ సభ్యులు పూజాక్రతువు నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.  ట్యాంక్ బండ్ పరిసరాలు గణపతి బప్పా మోరియా అంటూ భక్తుల గణపతి నామస్మరణతో మారుమోగుతున్నాయి. బడా గణేశుడితో పాటు పూజలందుకున్న దేవతల విగ్రహాలు ముందుగా శివపార్వతుల కళ్యాణ ఘట్టం విగ్రహాలు, శ్రీనివాస కళ్యాణ ఘట్టానికి సంబంధించిన విగ్రహాలు, అయోధ్య బాలరాముడిని పోలిన ప్రతిమ, రాహుకేతువుల ప్రతిమలను  నిమజ్జనం చేశారు. మహగణపతి నిమజ్జన క్రతువు కొనసాగుతుంది. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు 70 ఏళ్లుగా ఖైరతాబాద్ లో వివిధ రూపాల్లో పూజలందుకున్నారు. 70 ఏళ్లు కావడంతో ఈసారి 70 అడుగుల మట్టిప్రతిమను కమిటీ ప్రతిష్టించింది. ప్రపంచంలోనే ఎత్తయిన మట్టిగణపతిగా ఖైరతాబాద్ మహాగణపతి రికార్డు సృష్టించింది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ముందెన్నడూ లేనంతగా అధిక సంఖ్యలో భక్తుల తరలిరావడంతో రద్ధీ నెలకొంది. ఈ రోజు మధ్యహ్నం ఒకటిన్నరలోగా నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన కార్యక్రమానికి 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.