calender_icon.png 4 January, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తజన సంద్రంగా ఖైరతాబాద్

16-09-2024 05:00:00 AM

మహా గణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు

దర్శనానికి చివరి రోజు కావడంతో క్యూలైన్లలో బారులు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 15(విజయక్రాంతి): ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి ఆదివారం చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఖైరతాబాద్ ప్రాంతం భక్తజన సంద్రంగా మారింది. క్యూలైన్లలో నుంచి భక్తులు దర్శనం చేసుకునేందుకు గంటన్నర నుంచి రెండు గంటల సమయం పట్టింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు ప్రముఖులు భారీ గణనాథుడిని దర్శించుకున్నారు.

సాయంత్రం మోస్తరు వర్షం కురిసినప్పటికీ భక్తులు వర్షంలోనూ గణేశుడిని దర్శించుకున్నారు. ఐమాక్స్ వైపు ఉన్న బారికేడ్లను సాయంత్రం తొలగించడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఓ వృద్ధుడు కాసేపు స్పృహతప్పి పడిపోయాడు. భక్తుల రద్దీతో పాటు రోడ్లకు ఇరువైపులా వాహనాలు భారీగా పార్కింగ్ చేయడంతో  పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ రహదారిపై వాహనాల రాకపోకల కు అంతరాయం కలిగింది. పలుమార్లు ట్రాఫిక్ జాం అయింది. మెట్రోలో ప్రయాణికులు భారీగా తరలిరావడంతో మెట్రో స్టేషన్ కిటకిటలాడింది.  కాగా మంగళవారం నిమజ్జనం కోసం ఇప్పటికే అధికారులు, ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం కోసం భారీ ట్రాలీని తీసుకొచ్చారు.  

నిమజ్జనం నేపథ్యంలో 600 ప్రత్యేక బస్సులు.. 

ఈ నెల 17న జరగనున్న వినాయక నిమజ్జనం నేపథ్యంలో గ్రేటర్‌వ్యాప్తంగా 600 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ గ్రేటర్ జోనల్ ఈడీ సీ వినోద్ కుమార్ తెలిపారు. ట్యాంక్‌బండ్, ఎన్టీయార్ మార్గ్, నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలలో నిమజ్జనం వీక్షించేందుకు అనువుగా భక్తులకు ఈ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే కోఠి బస్ స్టేషన్ 9959226160, సికింద్రాబాద్ రేతిఫిల్ బస్ స్టేషన్ 99592 26154 నంబర్లలో సంప్రదించాలన్నారు. 

17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు..

గణపతి నిమజ్జనం నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ కేవీబీ రెడ్డి, సీనియర్ అధి కారులతో ఆయన సమావేశం నిర్వహించా రు. భక్తుల రద్దీ దృష్ట్యా మంగళవారం (సెప్టెంబర్ 17న) అదనపు సర్వీసులను నడపాలని నిర్ణయించామన్నారు. అన్ని రూట్లలో చివరి రైలు మంగళవారం అర్ధ రాత్రి తర్వాత 1 గంటలకు ప్రారంభమై 2 గంటలకు చివరి స్టేషన్‌కు చేరుతుందన్నారు. 

ట్యాంక్‌బండ్ వైపు 15 క్రేన్లు ఏర్పాటు.. 

ట్యాంక్‌బండ్‌పై అధికారులు నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ట్యాంక్ బండ్‌పై 15 క్రేన్లను ఏర్పాటు చేయగా, ఇంకా అవసరం అనుకుంటే మరికొన్ని క్రేన్లను ఏర్పాటు చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతిని ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఎన్టీయార్ మార్గ్‌లోని 5వ నంబర్ క్రేన్ వద్ద నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

భారీ బందోబస్తు:  సీపీ సీవీ ఆనంద్ 

మంగళవారం గణేశ్ నిమజ్జనంతో పాటు అదే రోజు రాత్రి ప్రారంభమయ్యే మిలాద్ ఉన్ నబీ ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఆదివారం సీపీ సీవీ ఆనంద్ అన్ని జోన్ల డీసీపీలు, ఎస్‌హెచ్‌ఓలు, పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే రెండు రోజులు నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. 

గణపతికి లడ్డూకు రికార్డు ధర 

మాదాపూర్ మైహోం భుజాలో 29 లక్షలకు సొంతం చేసుకున్న వ్యాపారి గణేశ్

శేరిలింగంపల్లి,  సెప్టెంబర్ 15: హైదరాబాద్ నగరంలో బాలాపూర్ గణేశుడి లడ్డూ ప్రతిసారి రికార్డు ధర పలుకుతుంది. అయితే, బాలాపూర్ లడ్డూ స్థాయిలోనే రికార్డు ధర పలుకుతుంది మాదాపూర్ గణేశ్ లడ్డూ. గతేడాది రూ.25.50 లక్షలకు అమ్ముడుపోయిన మైహోం భుజా లడ్డూ ఈసారి అంతకు మించి అనే రీతిలో రూ.29 లక్షల రికార్డు ధర పలికింది. ఖమ్మం జిల్లాకు చెందిన గణేశ్ అనే వ్యాపారి లడ్డూను సొంతం చేసుకున్నాడు. బాలాపూర్ లడ్డూ గతేడాది వేలంలో రూ.27 లక్షలకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే.