15-03-2025 12:56:55 AM
ఇప్పటికే పూర్తయిన నిర్మాణం
తాత్కాలిక షెడ్డులో విద్యార్థినుల ఇబ్బంది
పట్టించుకోని పాలకులు, అధికారులు
దేవరకొండ, మార్చి 14 : కొండమల్లేపల్లి మండలం కోల్ముంతల పహాడ్ శివారులో కేజీబీవీ భవనం నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి మాత్రం నోచడం లేదు. పూర్తయి నాలుగు నెలలు గడుస్తున్నా అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థినులకు తిప్పలు తప్పడం లేదు.
తాత్కాలిక షెడ్డులో చదువులు..
కేజీబీవీ 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు తాత్కాలికంగా ఓ ప్రైవేటు రేకుల షెడ్డులో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థినులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మొత్తం 187 మంది విద్యార్థినులు చదువుతున్నారు. రేకుల షెడ్డు కావడం, వసతులు లేకపోవడంతో ఇప్పటికే చాలా మంది విద్యార్థినులు టీసీలు తీసుకొని వెళ్లిపోయారు. వేసవి కావడంతో రేకులషెడ్డులో ఉక్కపోత కారణంగా విద్యార్థినులు నరకం చూస్తున్నారు. షెడ్డు చుట్టూ ప్రహరీ లేకపోవడంతో ఆకతాయిలు విద్యార్థినులను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. ఆకతాయిల చేష్టలతో తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఇక్కడ ఉంచేందుకు నిరాకరిస్తున్నారు.
నిర్మాణం పూర్తయినా..
కేజీబీవీ భవన నిర్మాణానికి నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 3.35 కోట్లు కేటాయించింది. 2021లో నాటి మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గతేడాది డిసెంబర్లో నిర్మాణం పూర్తయ్యింది. కానీ నేటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. భవనాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో జాప్యం జరుగుతుండడంపై విద్యార్థినులు వారి తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఉదాసీనత విడి త్వరగా అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.
ప్రహరీ నిర్మాణంలో జాప్యం..
కేబీబీవీ భవనం చుట్టూ ప్రహరీ నిర్మించడంలో జాప్యం జరుగుతుంది. భవనం నిర్మాణం జరిగినా దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. భవనాన్ని చేరుకునేందుకు రహదారి సైతం సరిగ్గా లేదు. రహదారిని నిర్మించాలని విద్యార్థినులు విన్నవిస్తున్నారు.
త్వరలో ప్రారంభిస్తాం..
కేజీవీబీ భవన నిర్మాణం పూర్తయ్యింది. చిన్నచిన్న పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వివరించాం. త్వరలోనే భవనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.
నాగేశ్వర్రావు, ఎంఈఓ, కొండమల్లేపల్లి